Vikarabad: కుల్కచర్లలో కలకలం: అదృశ్యమైన మహిళ హత్య కేసుగా మార్పు!

Vikarabad: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో బంగారు నగల కోసం మహిళను హత్య చేసి దహనం చేసిన ఘటన కలకలం రేపింది.

WAZID, PARIGI
Published on: 4 Oct 2026 9:03 AM IST
Vikarabad
X

Vikarabad: కుల్కచర్లలో కలకలం: అదృశ్యమైన మహిళ హత్య కేసుగా మార్పు!

Vikarabad: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన మహిళ హత్య కేసుగా తేలడం కలకలం రేపుతోంది. కుల్కచర్ల మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన గంధం అమృతమ్మ సెప్టెంబర్ 18వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది.

దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. గ్రామానికి చెందిన మంగలి ఆనంద్‌పై అనుమానం వ్యక్తం చేసి విచారించారు.పోలీసుల విచారణలో అమృతమ్మ, ఆనంద్ మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు వెల్లడైనట్లు సమాచారం.

అమృతమ్మకు సంబంధించిన బంగారు నగలను ఆనంద్ తాకట్టు పెట్టినట్లు.. వాటిని తిరిగి ఇవ్వాలని ఆమె నిలదీయడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అమృతమ్మను హత్య చేయాలని ఆనంద్ పథకం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం మృతదేహాన్ని గండీడ్ మండలం వెన్నచేడ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి నిప్పంటించి దహనం చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

ఆ తర్వాత మృతదేహానికి సంబంధించిన అవశేషాలను తెలంగాణ–కర్ణాటక సరిహద్దుల్లోని దేవసూర్ సమీప నదిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టడంతో నదిలో కొన్ని అవశేషాలు లభ్యమయ్యాయి. వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్‌కు తరలించారు. ప్రస్తుతం మంగలి ఆనంద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదృశ్యమైన మహిళ కేసు చివరకు హత్య కేసుగా తేలడంతో చెల్లాపూర్ పరిసరాల్లో తీవ్ర కలకలం రేపింది.

WAZID, PARIGI

WAZID, PARIGI