Hyderabad: నీళ్లు వృథా చేస్తే భారీ ఫైన్ తప్పదు.. 'పానీ' యాప్‌తో మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆదేశాలు!
Hyderabad: హైదరాబాద్‌లో నీటి వృథాను అరికట్టేందుకు 'పానీ' యాప్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. నీటిని దుర్వినియోగం చేస్తే జరిమానాలు తప్పవు, ప్రతీ భవనంలో వాటర్ హార్వెస్టింగ్ తప్పనిసరి.
Hyderabad: నగరంలో రోజురోజుకూ పడిపోతున్న భూగర్భ జలాల మట్టంపై హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జలమండలి (HMWSSB) రూపొందించిన వినూత్న ‘పానీ’ (Paani) యాప్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన నగర ప్రజలకు, భవన యజమానులకు పలు కీలక ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేశారు.
నగరంలో ఎవరైనా నీటిని దుర్వినియోగం చేస్తే 'పానీ' యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. నీటిని వృథా చేసే వారికి భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఒక్కో వ్యక్తికి రోజుకు 120 లీటర్ల చొప్పున తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
నగరంలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయని, దీనిని అరికట్టేందుకు ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్, వాణిజ్య భవనంలో వాటర్ హార్వెస్టింగ్ (ఇంకుడు గుంతలు) ఏర్పాటు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగర భవిష్యత్ తాగునీటి అవసరాలను తీర్చడానికి దాదాపు రూ. 7,000 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి ఫేజ్-2, ఫేజ్-3 పనులను ప్రభుత్వం వేగవంతంగా చేపడుతోందని వెల్లడించారు.




