Hyderabad: "చాలా కాలం కిందటే డిసైడ్ అయ్యాం..": కేపీహెచ్‌బీ దంపతుల సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు!

Hyderabad: హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఘోరం. మూడేళ్ల కుమార్తెను చంపి బెంగాల్‌కు చెందిన షెఫ్ దంపతులు ఆత్మహత్య. గోడపై రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం.

Arun Chilukuri
Published on: 28 Oct 2026 11:33 AM IST
Hyderabad
X

Hyderabad: "చాలా కాలం కిందటే డిసైడ్ అయ్యాం..": కేపీహెచ్‌బీ దంపతుల సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు!

Hyderabad: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. పండంటి పాపకు జన్మనిచ్చారు.. ఎంతో సంతోషంగా సాగుతుందనుకున్న వారి జీవితంలో ఏమైందో ఏమో గానీ, ఉన్నట్టుండి కన్నబిడ్డను చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన కూకట్‌పల్లి (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.

పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లా రాధామోహన్‌పూర్‌కు చెందిన గోపీనాథ్‌ బుయిన్‌ (30), సమత (26) 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 23 నెలల (ఏడాది 11 నెలలు) వయసున్న కుమార్తె 'స్నిగ్ధ' ఉంది.

కేపీహెచ్‌బీ మూడో ఫేజ్‌లో రెండేళ్లుగా నివాసముంటున్న గోపీనాథ్ గచ్చిబౌలిలోని ఒక హోటల్‌లో షెఫ్‌గా పనిచేస్తున్నాడు. అతని సోదరులు ఎల్‌బీనగర్, మాదాపూర్‌లలో షెఫ్‌లుగా స్థిరపడ్డారు.

పాప స్నిగ్ధను ప్రతిరోజూ ఆడిచే ఎదురింటి వృద్ధుడు మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి సాయంత్రం పోలీసులకు సమాచారం అందించాడు. కేపీహెచ్‌బీ పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా, డైనింగ్ హాల్‌లో దంపతులిద్దరూ సీలింగ్‌కు ఉరివేసుకుని కనిపించగా, పడక గదిలో చిన్నారి విగతజీవిగా పడి ఉంది.

బలవన్మరణానికి ముందు ఇంట్లోని గోడపై వారు రాసిన సందేశం అందరినీ కలిచివేసింది.."చాలా కాలం క్రితమే ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. తప్పు చేస్తున్నామని తెలుసు.. కానీ వేరే దారి కనిపించలేదు. మమ్మల్ని క్షమించండి. మా మరణానికి మూడో వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదు. బంధుమిత్రులను విచారించవద్దని మనవి." దీంతో పాటు బెంగాలీ, ఆంగ్ల భాషల్లో రాసిన సూసైడ్ నోట్లను క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది.


సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ రవికిరణ్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో విజయ్‌కుమార్‌లు మాట్లాడుతూ.. దంపతులు మరణించి దాదాపు 10 గంటలు అయి ఉండవచ్చని తెలిపారు. పాపను గొంతు నులిమి చంపారా లేదా విషమిచ్చారా అనేది పోస్టుమార్టం నివేదిక తర్వాత తెలుస్తుందన్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఆర్థిక ఇబ్బందులే ఈ తీవ్ర నిర్ణయానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.