Mahesh Kumar Goud: బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై 92 లక్షల ఓట్లు తొలగించాయి.. మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు
Mahesh Kumar Goud: తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి 92 లక్షల ఓట్లను తొలగించాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Mahesh Kumar Goud: బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై 92 లక్షల ఓట్లు తొలగించాయి.. మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు
Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై ఏకంగా 92 లక్షల ఓట్లను తొలగించాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు.
కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావడానికి మోదీ ప్రభుత్వం నిరంకుశ కుట్రలు పన్నుతోందని, ప్రజలు ఇప్పటికైనా ఈ మోసాలను గుర్తించి మేల్కోవాలని పిలుపునిచ్చారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా యథేచ్ఛగా ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపించారు.
"బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తెలంగాణను టార్గెట్ చేసింది. నరేంద్ర మోదీ, అమిత్ షా పాలనలో గత 12 ఏళ్లలో దేశ ప్రజలకు ఒరిగిందేమిటో ఆలోచించుకోవాలి" అని ఆయన ప్రశ్నించారు. తాము పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన్ను పదవి నుంచి తొలగించే వరకు తమ పోరాటం, ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని మహేశ్ గౌడ్ తేల్చి చెప్పారు.




