CP Mahesh Bhagwat: హైదరాబాద్‌లో ఇక నేరగాళ్ల ఆటలు సాగవు.. కొత్త సీపీ మహేష్ భగవత్ హెచ్చరిక
CP Mahesh Bhagwat: హైదరాబాద్ నూతన సీపీగా మహేష్ భగవత్ బాధ్యతలు స్వీకరించారు.
CP Mahesh Bhagwat: హైదరాబాద్‌లో ఇక నేరగాళ్ల ఆటలు సాగవు.. కొత్త సీపీ మహేష్ భగవత్ హెచ్చరిక
CP Mahesh Bhagwat: హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా (CP) మహేష్ భగవత్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణపై తన ప్రాధాన్యతలను ఆయన స్పష్టం చేశారు. తనకు హైదరాబాద్ నగరంలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉందని గుర్తుచేసుకున్న ఆయన.. 2004లో సౌత్ జోన్ డీసీపీగా, 2010లో జాయింట్ సీపీ అడ్మిన్‌గా, జాయింట్ సీపీ స్పెషల్ బ్రాంచ్‌గా, ఆ తర్వాత వివిధ హోదాల్లో నగరంలో సేవలు అందించినట్లు వివరించారు.
కోర్ అర్బన్ రీజియన్ ఏర్పడటంతో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధి మరింత విస్తరించిందని, కొత్త జోన్లు కూడా వచ్చాయని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా దృష్టి సారిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు 'గోల్డెన్ అవర్'లో తక్షణ వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నగరంలో భూముల విలువలు విపరీతంగా పెరగడంతో భూవివాదాలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు పెరుగుతున్నాయని మహేష్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లలో సివిల్ సెటిల్మెంట్లను ఏమాత్రం సహించేది లేదని కఠినంగా హెచ్చరించారు.
బతికి ఉన్నవారికే నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి అక్రమంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర నేర ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు.
శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే హైదరాబాద్ మరింత 'సేఫ్ సిటీ'గా పేరు తెచ్చుకుంటుందని, అప్పుడే నగరానికి పెట్టుబడులు వచ్చి అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆకాంక్షించారు.
నేరాల నియంత్రణకు ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటామని, పెండింగ్ కేసుల్లో నిందితులకు కచ్చితంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని సీపీ చెప్పారు. పాత నేరస్తులు, రిపీటెడ్ అఫెండర్లపై నిరంతరం నిఘా ఉంచి పీడీ (PD) యాక్ట్‌లు ప్రయోగిస్తామని హెచ్చరించారు. గతంలో పనిచేసిన కమిషనర్లు తీసుకున్న మంచి చర్యలన్నింటినీ కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ప్రజలతో మమేకమవుతూ, హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని తెలిపారు. అత్యవసర సేవల కోసం 'డయల్ 112', 'డయల్ 100' సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. తాను స్వయంగా ప్రతి పోలీస్ స్టేషన్‌ను క్రమం తప్పకుండా సందర్శిస్తానని, బేసిక్ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. సాయంత్రం వేళల్లో అధికారులు, సిబ్బంది విధిగా రోడ్లపై ఉండేలా పెట్రోలింగ్ పెంచుతామని వెల్లడించారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా 'సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్'కు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మహేష్ భగవత్ హామీ ఇచ్చారు.




