Jagtial: జగిత్యాల బాలుడి కేసులో షాకింగ్ ట్విస్ట్.. హైకోర్టు తీర్పుపై కలెక్టర్ సంచలన పిటిషన్!
Jagtial: జగిత్యాల బాలుడి దత్తత కేసులో కలెక్టర్ సత్యప్రసాద్ సంచలన నిర్ణయం. బాలుడిని తిరిగి సీడబ్ల్యూసీకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్.
Jagtial: జగిత్యాల బాలుడి కేసులో షాకింగ్ ట్విస్ట్.. హైకోర్టు తీర్పుపై కలెక్టర్ సంచలన పిటిషన్!
Jagtial: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన జగిత్యాల బాలుడి దత్తత వ్యవహారంలో మరో ఊహించని సంచలన పరిణామం చోటుచేసుకుంది. ‘అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది’ అంటూ శిశు సంక్షేమ కేంద్రంలో పసివాడు కన్నీరుమున్నీరుగా రోదించిన దృశ్యాలు అందరి హృదయాలను ద్రవింపజేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు రెండు రోజుల క్రితమే ఆ చిన్నారిని పెంపుడు తల్లిదండ్రులకు అధికారులు అప్పగించడంతో వివాదం ముగిసిందని భావించినప్పటికీ, కథ మళ్లీ మొదటికి వచ్చింది.
బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయడం కలకలం రేపుతోంది. గత ఉత్తర్వులపై తక్షణమే స్టే విధించి, చిన్నారిని తిరిగి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సంరక్షణకే అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబిగద్దెకు చెందిన సరిత, శ్రీనివాస్‌గౌడ్ దంపతులకు సంతానం లేకపోవడంతో మూడేళ్ల క్రితం కోరుట్లకు చెందిన ఓ కుటుంబం నుంచి తల్లి లేని నెల రోజుల పసికందును తెచ్చుకుని కంటికి రెప్పలా పెంచుకుంటున్నారు. అయితే కుటుంబ ఆస్తి తగాదాల నేపథ్యంలో శ్రీనివాస్‌గౌడ్ బంధువులు సదరు దత్తత చట్టబద్ధంగా జరగలేదని అధికారులకు ఫిర్యాదు చేయడంతో, సెప్టెంబర్ 16న అధికారులు బాలుడిని కరీంనగర్ శిశుగృహకు తరలించారు.
బిడ్డ కోసం ఆ దంపతులు హైకోర్టును ఆశ్రయించగా, అక్టోబర్ 16న న్యాయస్థానం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశించింది. అప్పగింతలో జాప్యం జరిగి శిశుగృహలో పసివాడు ఏడ్చిన వీడియో వైరల్ కావడంతో అధికారులు దిగివచ్చి బిడ్డను అప్పగించారు. రెండు నెలల తర్వాత తమ బిడ్డ చేతికి అందడంతో ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.
అయితే బాలుడు తల్లిదండ్రుల వద్దకు చేరిన కొద్దిరోజులకే కలెక్టర్ సత్యప్రసాద్ కోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. సీడబ్ల్యూసీ నిబంధనలు మరియు అధికారులు సమర్పించిన ఆధారాలను పూర్తిగా పరిశీలించకుండానే బాలుడిని అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని కలెక్టర్ తమ పిటిషన్లో పేర్కొన్నారు. కేవలం హిందూ సంప్రదాయం ప్రకారం దత్తత తీసుకున్నంత మాత్రాన దానిని చట్టబద్ధమైన దత్తతగా పరిగణించవచ్చా లేదా అనే అంశాన్ని లోతుగా పరిశీలించాలని కోర్టును కోరారు.
బాలుడు తల్లిదండ్రుల వద్దే ఉంటే దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశం ఉందన్న కలెక్టర్, గత ఉత్తర్వులపై స్టే విధించి చిన్నారిని తిరిగి సీడబ్ల్యూసీ సంరక్షణలోకి పంపాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పసివాడి భవిష్యత్తు మరియు తల్లిదండ్రుల నిరీక్షణపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.




