తెలంగాణలో మరో కొత్త పథకం.. ఈ నెల 19 నుంచి ప్రారంభం!
Indiramma Jeevitha Bima: నవంబర్ 19న సిద్దిపేటలో 'ఇందిరమ్మ జీవిత బీమా' ప్రారంభం. తెలంగాణ కేబినెట్ భేటీలో మేడిగడ్డ మరమ్మతులు, వేర్వేరు ఎస్సీ, ఎస్టీ కమిషన్లపై కీలక నిర్ణయాలు.
తెలంగాణలో మరో కొత్త పథకం.. ఈ నెల 19 నుంచి ప్రారంభం!
Indiramma Jeevitha Bima: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన 38వ మంత్రిమండలి సమావేశంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం మరియు పాలనారంగంలో కీలక నిర్ణయాలకు ఆమోదం ముద్ర వేశారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం రవాణా, బీసీ సంక్షేమ శాఖల సహచర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిలతో కలిసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో నిర్ణయాల వివరాలను పంచుకున్నారు.
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన సిద్దిపేట వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ఇందిరమ్మ జీవిత బీమా' పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. నవంబర్ 19 నుంచే ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. అదే రోజున ఇందిరమ్మ చీరల రెండో విడత పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనున్నట్లు స్పష్టం చేశారు.
అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన సుందిళ్ల, అన్నారం మరియు మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులకు సంబంధించి నిపుణుల పూర్తిస్థాయి నివేదిక అందిందని కేబినెట్ తెలిపింది. ఈ నివేదికపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రిమండలి, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అత్యంత పారదర్శక పద్ధతిలో మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా ఉపయోగంలోకి తీసుకురావాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.
మరోవైపు సామాజిక న్యాయం దిశగా మరో విప్లవాత్మక నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ఉమ్మడిగా ఒకటే కమిషన్ ఉండగా, సర్వత్ర వ్యక్తమవుతున్న అభిప్రాయాల మేరకు రానున్న రోజుల్లో ఎస్సీలకు మరియు ఎస్టీలకు వేర్వేరుగా స్వతంత్ర కమిషన్లు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు.
దీనితో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల అవసరాల కోసం ఏడు కీలక ప్రాంతాల్లో రెవెన్యూ భూముల బదిలీకి మరియు పలు ప్రభుత్వ పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్రంలో సరికొత్త సంక్షేమ కాంతులను నింపుతాయని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు.




