Water Supply: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. తాగునీటి సరఫరాపై జలమండలి కీలక ఆదేశాలు

Water Supply: దసరా, దీపావళి పండగల సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

CR Reddy
Published on: 19 Oct 2026 8:36 AM IST
Water Supply
X

Water Supply

Water Supply: దసరా, దీపావళి పండగల సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రహదారులు, ఉత్సవ ప్రదేశాలలో సీవరేజ్ ఓవర్‌ఫ్లో సమస్యలు రాకుండా ముందస్తుగా మ్యాన్‌హోళ్లను, పైప్‌లైన్లను తనిఖీ చేయాలని సూచించారు. జూమ్ ద్వారా నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన పాల్గొంటూ, ఫిర్యాదులు అందిన వెంటనే క్షేత్రస్థాయి సిబ్బంది వేగంగా స్పందించేలా యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.

నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్లు

మంచినీటి వృథాను అరికట్టేందుకు జలమండలి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిర్మాణ రంగానికి, పార్కులకు అలాగే ల్యాండ్‌స్కేపింగ్‌కు అవసరమైన నీటి కోసం శుద్ధి చేసిన మురుగునీటిని అందించే గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలను నవంబర్ 1 నుంచి అందుబాటులోకి తెస్తున్నారు. వినియోగదారులు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ట్యాంకర్లను బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. ట్యాంకర్ల రిజిస్ట్రేషన్, ఏకరీతి బ్రాండింగ్ ప్రక్రియలతో పాటు ట్రయల్ రన్ పూర్తి చేయాలని ఐటీ విభాగాన్ని ఎండీ ఆదేశించారు.

మురుగునీటి శుద్ధి కేంద్రాల (STP) నాణ్యతా ప్రమాణాలు

నగరవ్యాప్తంగా పనిచేస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రాల పనితీరును ఉన్నతాధికారులు నిరంతరం పరిశీలించాలని అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రయోగశాలలలో నీటి నాణ్యతా పరీక్షలు జరిపి, నిర్ణీత ప్రమాణాలను అందుకోని కేంద్రాల్లో వెంటనే సాంకేతిక లోపాలను సరిచేయాలని చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు ఫిల్టర్లు అమర్చి శుద్ధి ప్రక్రియ నాణ్యతను మెరుగుపరచాలని ఆదేశించారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు రీసైకిల్ చేసిన నీటి వినియోగం గణనీయంగా పెరుగుతుంది.

ట్యాంకర్ల సంఖ్య పెంపు అలాగే వేసవి కార్యాచరణ

ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1,200 ట్యాంకర్లకు అదనంగా మరో 500 ట్యాంకర్లను కొత్తగా నమోదు చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు. ముఖ్యంగా బోడుప్పల్ ప్రాంతంలో పెండింగ్ బుకింగ్‌లను వేగంగా పూర్తి చేయడానికి అదనంగా 50 ట్యాంకర్లను కేటాయించారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఘట్‌కేసర్, కీసర వంటి శివారు ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించాలని సూచించారు. పంపింగ్ స్టేషన్లలో విద్యుత్ హెచ్చుతగ్గులు లేకుండా జాగ్రత్తలు వహిస్తూ, లీకేజీల మరమ్మతులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.