Dussehra Rush: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్..!

Dussehra Rush: దసరా పండుగ వేళ హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు స్వగ్రామాలకు భారీగా తరలివెళ్తున్నారు.

Gagan kumar
Published on: 17 Oct 2026 10:57 AM IST
Dussehra Rush
X

Dussehra Rush: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్..!

Dussehra Rush: తెలంగాణ పెద్ద పండుగ 'దసరా' వచ్చేసింద. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు నగరవాసులు భారీగా సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. బడి పిల్లలకు సెలవులు రావడమే కాకుండా, ఉద్యోగులు కూడా వరుస సెలవులను వినియోగించుకుంటూ పల్లెబాట పట్టారు. దీంతో భాగ్యనగరం క్రమంగా ఖాళీ అవుతుండగా.. రహదారులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఒకేసారి లక్షలాది మంది ప్రజలు నగరం నుంచి బయలుదేరడంతో హైదరాబాద్‌లోని ప్రధాన జంక్షన్ల వద్ద వాహనాల రద్దీ తీవ్రస్థాయికి చేరింది.

మియాపూర్ నుంచి బాలానగర్ వై జంక్షన్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు అంగుళం అంగుళం చొప్పున నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్, సొంత కార్లు, ద్విచక్రవాహనాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుండటంతో జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద కూడా రద్దీ వాతావరణం నెలకొంది.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ట్రాఫిక్ చిక్కులను దాటుకుని మరీ స్వగ్రామాలకు చేరుకోవాలనే ఉత్సాహం ప్రయాణికులలో కనిపిస్తోంది. పల్లెల్లో దసరా వేడుకలు, శమీ పూజలు, బంధువుల కలయికల కోసం నగరవాసులు ఎంతో ఆత్రుతగా తమ గమ్యస్థానాలకు పయనమవుతున్నారు. నగరంలో ఒకవైపు రద్దీ నెలకొంటే, మరోవైపు తెలంగాణ పల్లెల్లో అప్పుడే పండుగ శోభ ఉట్టిపడుతోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.