Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్ షాపులు బంద్
Wine Shops Close: గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా డ్రై డే ప్రకటించారు. హైదరాబాద్‌తో పాటు అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు పూర్తిగా మూసివేయనున్నారు.
Wine Shops Close
Wine Shops Close: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా డ్రై డే అమల్లో ఉండనుంది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, స్టార్ హోటళ్లు, కల్లు దుకాణాలు పూర్తిగా మూసివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గాంధీజీ అహింసా సిద్ధాంతాలను గౌరవిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 2న మద్యం అమ్మకాలను నిలిపివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నిబంధనలను వ్యాపారులు అందరూ విధిగా పాటించాలని అధికారులు కోరారు.
ఎక్సైజ్ శాఖ నిబంధనలు.. లైసెన్సులు రద్దు
అక్టోబర్ 2న వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు కఠినంగా అమల్లో ఉంటాయి. తిరిగి అక్టోబర్ 3న ఉదయం నుంచి దుకాణాలు యథావిధిగా తెరుచుకుంటాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని పోలీసు కమిషనర్లు ఈ నిబంధనల అమలును పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ధిక్కరించి గుట్టుగా మద్యం విక్రయిస్తే, వారిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వ్యాపార లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉంటుంది.
నాన్ వెజ్ షాపులు కూడా బంద్
గాంధీ జయంతి సందర్భంగా కేవలం మద్యం దుకాణాలు మాత్రమే కాకుండా మాంసం విక్రయాలు కూడా పూర్తిగా నిలిచిపోనున్నాయి. మేకలు, గొర్రెలు, పశువుల వధశాలలతో పాటు నగరంలోని అన్ని చికెన్, మటన్, బీఫ్ షాపులు అక్టోబర్ 2న తెరుచుకోవడానికి వీలులేదు. అహింసా మార్గాన్ని బోధించిన మహాత్మా గాంధీకి నివాళిగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రజలందరూ, వ్యాపార వర్గాలు ఈ నిబంధనలకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.




