Bhatti Vikramarka: హరీష్ రావు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్.. యాదాద్రి పవర్ ప్లాంట్‌పై సంచలన నిజాలు!

Bhatti Vikramarka: యాదాద్రి పవర్ ప్లాంట్ మరియు బొగ్గు కేటాయింపులపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రెస్‌మీట్ పెట్టి గట్టి కౌంటర్ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 7 Oct 2026 3:08 PM IST
Bhatti Vikramarka
X

Bhatti Vikramarka: హరీష్ రావు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్.. యాదాద్రి పవర్ ప్లాంట్‌పై సంచలన నిజాలు!

Bhatti Vikramarka: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంపై మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న విమర్శలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో బదులిచ్చారు. ఎల్‌నినో ప్రభావం వల్ల దేశంలో, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని, ప్రస్తుతం రాష్ట్రంలో 19,892 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉందని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రాల డిమాండ్‌తో సమానంగా మన రాష్ట్రంలోనూ డిమాండ్ పెరిగినప్పటికీ, ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్ ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు విద్యుత్ వినియోగంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

కష్టకాలంలోనూ జాగ్రత్తగా విద్యను అందిస్తున్న సిబ్బందిని అభినందించాల్సింది పోయి.. కొందరు నాయకులు తప్పుడు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు.. రాష్ట్రానికి నష్టం చేకూరేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

యాదాద్రి పవర్ ప్లాంట్‌కు సంబంధించి కనీసం డీపీఆర్ (DPR) ఉందా?.. కోల్ లింకేజ్ ప్లాన్ చేశారా? అని నిలదీశారు. నది లేకుండా హైడల్ పవర్, కోల్ లేకుండా థర్మల్ పవర్ పెట్టినట్లుగా ప్రారంభం నుంచే కోల్ లేకుండా యాదాద్రి ప్లాంట్ కట్టి రాష్ట్రంపై భారం వేశారని ఆరోపించారు.

యాదాద్రి ప్లాంట్ ద్వారా యూనిట్‌కు రూ.6.60 పైసలు పడుతోందని, కాకతీయలో రూ.4.97, కొత్తగూడెంలో రూ.4.62 మాత్రమే పడుతుందని తెలిపారు. అప్పుడు సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల రూ. 40 వేల కోట్ల భారం రాష్ట్రంపై పడిందన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక ఎన్జీటీ (NGT) కేసులు క్లియర్ చేయించి, నైనీ బ్లాక్ నుంచి మైనింగ్ మొదలుపెట్టి యాదాద్రికి బొగ్గు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను తాము సరిదిద్దుకుంటూ పవర్ ప్లాంట్‌ను నడిపిస్తున్నామని స్పష్టం చేశారు.

వారానికి ఒకసారి బీఆర్ఎస్ తప్పులను ఆధారాలతో సహా బయటపెడతామని హెచ్చరించిన భట్టి విక్రమార్క.. రాజకీయ లబ్ధి కోసమే కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.