Weather Update: తెలంగాణలో మరో 24 గంటలు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన డీప్ డిప్రెషన్ కారణంగా తెలంగాణలో వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Weather Update
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన డీప్ డిప్రెషన్ కారణంగా తెలంగాణలో వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాగల మరో 24 గంటల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలపై ఈ వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
విస్తృతంగా కురుస్తున్న వర్షాలు
గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అత్యధికంగా 130.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో 114 మి.మీ, హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌లో 110.3 మి.మీ, జనగామ జిల్లా చిల్పూర్‌లో 110 మి.మీ, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో 108.8 మి.మీ చొప్పున భారీ వర్షపాతం రికార్డైంది. ఇక రాజధాని హైదరాబాద్‌లో కూడా తూర్పు ప్రాంతాలైన ఘట్‌కేసర్, కుత్బుల్లాపూర్, వనస్థలిపురంలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిశాయి. సూర్యాపేట, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోనూ వర్షాలు జనజీవనాన్ని ప్రభావితం చేశాయి.
రేపటి నుంచి తగ్గనున్న వర్షాల జోరు
ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న ఈ దీప్ డిప్రెషన్ ప్రభావం శుక్రవారం ఉదయం నుంచి తెలంగాణపై క్రమంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో బ్రేక్ మాన్సూన్ పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ ఉంది. కొన్ని ప్రాంతాలలో వాతావరణం తేమగా ఉన్నప్పటికీ, విస్తృత వర్షాలు మాత్రం ఉండే అవకాశం లేదు. దీనివల్ల సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉక్కపోత, ఎండ తీవ్రత, వేడి వాతావరణం మళ్లీ కనిపించే అవకాశం ఉందని వెల్లడించారు.
అక్టోబర్‌లో మళ్లీ పలకరించనున్న వర్షాలు
ప్రస్తుతానికి సెప్టెంబర్ చివరి నాటికి వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, రాబోయే అక్టోబరు నెలలో మళ్లీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ మధ్య అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ పరిశీలనలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత ఖచ్చితమైన సమాచారం రానున్న రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ, ప్రస్తుత వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.




