పాపం.. గోదావరిలో పొంచి ఉన్న మృత్యువును గుర్తించలేకపోయిన గోమాత.. చివరికి ఇలా జరిగింది!
Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలం సారంగాపూర్ గ్రామ శివారులో గోదావరి నదిలో నీళ్లు తాగేందుకు వెళ్లిన ఆవుపై మొసలి దాడి చేసింది.
పాపం.. గోదావరిలో పొంచి ఉన్న మృత్యువును గుర్తించలేకపోయిన గోమాత.. చివరికి ఇలా జరిగింది!
Nirmal: గోదావరి నదిలో మొసళ్ల సంచారం పశువుల కాపరులు, తీర ప్రాంత గ్రామస్థులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దాహం తీర్చుకునేందుకు నదిలోకి దిగిన ఓ ఆవుపై నీటిలో మాటువేసి ఉన్న మొసలి ఒక్కసారిగా దాడి చేసింది. ప్రాణభయంతో పెనుగులాడుతూ ఆ ఆవు మొసలి బారి నుంచి బయటపడినప్పటికీ, తీవ్ర గాయాలపాలై చివరకు మృత్యువాత పడింది. నిర్మల్ జిల్లా కడెం మండలం సారంగాపూర్ గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
సారంగాపూర్ గ్రామానికి చెందిన రైతు సార్ల రాజేందర్ బుధవారం (నవంబర్ 11) తన ఆవుల మందను గ్రామ శివారులోని గోదావరి పరివాహక ప్రాంతానికి మేతకు తీసుకెళ్లాడు. మేత మేస్తున్న క్రమంలో దాహం వేయడంతో మందలోని ఓ ఆవు సమీపంలోని గోదావరి నది వద్దకు వెళ్లింది. నీళ్లు తాగేందుకు నదిలోకి దిగిన ఆవుపై అప్పటికే నీటిలో పొంచి ఉన్న మొసలి మెరుపు దాడి చేసింది. ఆవు మూతిని తన నోటితో గట్టిగా పట్టుకుని లోపలికి లాగేందుకు ప్రయత్నించింది.
ప్రాణభయంతో పెనుగులాడి ఒడ్డుకు చేరినా..
ఊహించని ఈ పరిణామంతో ఆవు ప్రాణభయంతో తీవ్రంగా పెనుగులాడింది. మొసలి పట్టు నుంచి విడిపించుకునేందుకు విశ్వప్రయత్నం చేసి, ఎట్టకేలకు ఒడ్డుకు చేరుకోగలిగింది. అయితే అప్పటికే మొసలి పంజాకు ఆవు మూతికి తీవ్ర గాయాలయ్యాయి. కొద్దిసేపటి తర్వాత ఆవు పరిస్థితిని గమనించిన పశువుల కాపరి వెంటనే యజమాని రాజేందర్‌కు సమాచారం అందించాడు. సాయంత్రం ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం, గాయాల కారణంగా ఆవు అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించడంతో యజమాని కన్నీరుమున్నీరయ్యాడు.
అప్రమత్తత అవసరం అంటున్న గ్రామస్థులు
ఈ ఘటనతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో మొసళ్ల సంచారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిత్యం పశువులను మేతకు తీసుకెళ్లే కాపరులు, నదీ తీర గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పశువులను నీటి కోసం నదిలోకి వదిలే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. అటవీ, సంబంధిత శాఖ అధికారులు స్పందించి మొసళ్ల సంచారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పశువుల రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.




