Revanth Reddy: ఎల్‌నీనో ప్రభావంతో తెలంగాణకు నీటి కష్టాలు? రైతులకు సీఎం కీలక సూచనలు!

Revanth Reddy: ఎల్‌నినో ప్రభావంతో రానున్న ఎనిమిది నెలలు వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Arun Chilukuri
Published on: 28 Nov 2026 1:15 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: ఎల్‌నీనో ప్రభావంతో తెలంగాణకు నీటి కష్టాలు? రైతులకు సీఎం కీలక సూచనలు!

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను అప్రమత్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని, వచ్చే ఎనిమిది నెలల పాటు వర్షాలు లేకపోవచ్చని అంచనా వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, పొదుపుగా వినియోగించాలని సూచించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక్కటే కాకుండా ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ‘క్లైమేట్ కాన్‌క్లేవ్–గ్లోబల్ సమిట్’ కార్యక్రమానికి సంబంధించిన కర్టెన్ రైజర్‌లో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎల్‌నినో ప్రభావం తెలంగాణకే పరిమితం కాదని, ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని సీఎం పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారిలాగే వాతావరణ మార్పులు కూడా ప్రపంచవ్యాప్తంగా పెను సవాలుగా మారాయని అన్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కేవలం రెండు గంటల్లోనే 24 సెంటీమీటర్ల వరకు కురిసే సందర్భాలు ఉన్నాయని, కానీ నగర మౌలిక సదుపాయాల రూపకల్పన మాత్రం రెండు సెంటీమీటర్ల వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని జరిగిందని వివరించారు. దీంతో ఆకస్మిక భారీ వర్షాలు, క్లౌడ్‌బరస్ట్‌ల సమయంలో వరదలు సంభవించి కాలనీలు నీటమునిగే పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పారు.

రైతులు కూడా నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రానికి ప్రధాన సమస్య ఆహార ధాన్యాల కొరత కాదని, నీటి కొరతేనని స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్లకు సరిపడా ఆహార ధాన్యాలు రాష్ట్రంలో అందుబాటులో ఉంటాయని, గతంలో కరవు సమయంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్ల అవసరం ఇప్పుడు ఉండదని భరోసా ఇచ్చారు.

డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ గ్లోబల్ సమిట్‌లో ప్రత్యేకంగా క్లైమేట్ కాన్‌క్లేవ్ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్‌లోని రెండు లక్షల డీజిల్ ఆటోలను యజమానులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే, నగర పరిధిలో డీజిల్ ఆర్టీసీ బస్సులను కూడా దశలవారీగా తొలగించనున్నట్లు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.