Revanth Reddy: ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న విగ్రహం.. రవీంద్రభారతి సభలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటనలు!
Revanth Reddy: పండుగ సాయన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడి.
Revanth Reddy: ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న విగ్రహం.. రవీంద్రభారతి సభలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటనలు!
Revanth Reddy: భూస్వాములు, జమిందార్ల ఆగడాలపై ధైర్యంగా పోరాటం చేసిన యోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కొనియాడారు. రవీంద్రభారతిలో నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దొరలు అన్యాయంగా ఆక్రమించిన భూములను తన పోరాటంతో పేదలకు పంచిపెట్టిన సాయన్న చరిత్ర ఎందరికో ఆదర్శమని, చరిత్ర పుటల్లో ఆయనకు సముచిత స్థానం ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఆయన పోరాట గాథలను ఇప్పటికీ ప్రజలు జానపదాలుగా పాడుకుంటున్నారని గుర్తుచేశారు.
ఈ వేదికగా పండుగ సాయన్నకు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు. ట్యాంక్‌బండ్‌పై దొడ్డి కొమురయ్యతో పాటు పండుగ సాయన్న విగ్రహాలను ప్రతిష్టించనున్నట్లు సీఎం ప్రకటించారు. అంతేకాకుండా, ప్రభుత్వం తరఫున పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తామని వెల్లడించారు. సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మహాసూర్యుల స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని, కవి అందెశ్రీ, ప్రజాకవి గద్దర్‌కు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలిచిందని పేర్కొన్నారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ముదిరాజ్‌ల జనాభానే అత్యధికమని, గతంలో వారు తనకు చేసిన సాయాన్ని ఎప్పటికీ మరుచనని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక ముదిరాజ్ బిడ్డలకు అనేక అవకాశాలు కల్పించామని, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మంత్రి వాకిటి శ్రీహరికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించానని గుర్తుచేశారు. ముదిరాజ్‌లను బీసీ 'డి' నుంచి బీసీ 'ఏ'లోకి మార్చాలని కోరుతున్న డిమాండ్‌పై స్పందిస్తూ.. బీసీ సామాజిక వర్గాలకు పూర్తి న్యాయం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలోనే ఎవరూ చేయని విధంగా ఏడాదిలోనే కులగణన పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ కులాల వర్గీకరణను కూడా చేపట్టి సంచలనం సృష్టించామన్నారు.
గత ప్రభుత్వాలు అందించిన సంక్షేమ పథకాలను రెండింతలు చేసి అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.48 కోట్ల మంది పేదలకు రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఎల్ నినో (El Nino) ప్రభావం వల్ల మార్కెట్లో సన్నబియ్యం ధరలు పెరిగినప్పటికీ, పేదలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఎన్నికల్లో తమకు అండగా నిలవాలని, ప్రజలకు ఏది కావాలన్నా తాను చూసుకుంటానని భరోసానిచ్చారు.




