Chicken Price: నాన్‌వెజ్ లవర్లకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు
Chicken Price: నాన్‌వెజ్ ప్రియులకు శుభవార్త! కార్తీక మాసం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి.
Chicken Price
Chicken Price: తెలుగు రాష్ట్రాల్లోని మాంసాహార ప్రియులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్తే. గత కొద్ది రోజులుగా ఆకాశంలో ఉన్న చికెన్ ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేలకు దిగొచ్చాయి. కార్తీక మాసం కావడంతో చాలా మంది నాన్‌వెజ్ తినడానికి దూరంగా ఉండటం, ప్రస్తుతానికి పెద్ద పండుగలేవీ లేకపోవడం వల్ల చికెన్‌కు డిమాండ్ భారీగా పడిపోయింది. దీనికి తోడు పౌల్ట్రీ ఫారాల నుంచి కోళ్ల సరఫరా ఎక్కువగా ఉండటంతో ధరలు కుప్పకూలాయి. ఇటీవల దసరా, దీపావళి పండుగల సమయంలో పెరిగిన రేట్లతో పోలిస్తే ఇప్పుడు సామాన్యులకు చికెన్ ధరలు ఎంతో ఊరటనిస్తున్నాయి.
పలు నగరాల్లో చికెన్ రేట్లు ఇవే
ఆదివారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో చికెన్ ధరలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ రూ.226 నుంచి రూ.240 మధ్య విక్రయిస్తుండగా, డ్రస్స్‌డ్ చికెన్ రూ.200 పలుకుతోంది. రిటైల్ లైవ్ బర్డ్ ధర రూ.129, ఫారం వద్ద లైవ్ బర్డ్ రూ.102గా ఉంది. విజయవాడ జోన్ పరిధిలో కిలో స్కిన్లెస్ చికెన్ రూ.222 నుంచి రూ.230 మధ్య ఉండగా, డ్రస్స్‌డ్ చికెన్ రూ.197, రిటైల్ లైవ్ బర్డ్ రూ.127, ఫారం వద్ద రూ.100 వద్ద అమ్ముతున్నారు. ఇక కరీంనగర్ జోన్లో స్కిన్లెస్ రూ.226, డ్రస్స్‌డ్ రూ.200, రిటైల్ లైవ్ బర్డ్ రూ.129, ఫారం లైవ్ బర్డ్ రూ.102గా కొనసాగుతున్నాయి.
మండిపోతున్న కోడిగుడ్ల ధరలు
ఒకవైపు చికెన్ ధరలు తగ్గుముఖం పడుతుంటే, మరోవైపు కోడిగుడ్ల ధరలు మాత్రం పైకి ఎగబాకడం గమనార్హం. కరీంనగర్ జోన్ పరిధిలో డజను (12) కోడిగుడ్ల రిటైల్ ధర ఏకంగా రూ.86 పలుకుతోంది. హైదరాబాద్‌లో డజను గుడ్ల ధర రూ.84 వద్ద ఉండగా, విజయవాడ పరిధిలో రూ.80గా విక్రయిస్తున్నారు. చలికాలం కావడంతో గుడ్లకు డిమాండ్ పెరగడం ఈ ధరల పెరుగుదలకు ఒక కారణంగా కనిపిస్తోంది.
క్రిస్మస్ ముందు మళ్లీ పెరగనున్న డిమాండ్
ఈ నెలాఖరు వరకు చికెన్ ధరలు ఇదే విధంగా తక్కువ స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. అయితే వచ్చే నెలలో క్రిస్మస్ పండుగ వస్తుండటంతో మళ్లీ నాన్‌వెజ్‌కు డిమాండ్ పెరిగే సూచనలు ఉన్నాయి. పండుగ సీజన్ సమీపించే కొద్దీ కోళ్ల వినియోగం పెరిగి, క్రిస్మస్కు ముందే చికెన్ ధరలు మళ్లీ కొండెక్కే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కిలో చికెన్ రూ.400కు చేరుతుందా?
ప్రస్తుతం ధరలు తగ్గినా రానున్న రోజుల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు చుక్కలను తాకవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడం పౌల్ట్రీ రంగంపై ప్రభావం చూపుతోంది. దీనివల్ల కోళ్ల దాణా ఖర్చులు, ఫారాల నిర్వహణ వ్యయం, రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో కిలో చికెన్ ధర రూ.400 మార్కును కూడా తాకే ప్రమాదం ఉందని, అది సామాన్యులకు పెను భారంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.




