Harish Rao: కాంగ్రెస్ అభయ హస్తం.. శూన్య హస్తంగా మారింది
Harish Rao: కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Harish Rao: కాంగ్రెస్ అభయ హస్తం.. శూన్య హస్తంగా మారింది
Harish Rao: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలై మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మూడేళ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఊసేలేదని ఆయన ఆక్షేపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తూ హరీశ్ రావు పోస్ట్ చేశారు.
గాంధీభవన్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ‘అభయ హస్తం’ కాస్తా ‘శూన్య హస్తం’గా మారిందని విమర్శించారు. ఈ వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
‘‘తొలి క్యాబినెట్ భేటీలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీ నీటిమూటగానే మిగిలింది. ఇప్పటివరకు 38 క్యాబినెట్ సమావేశాలు జరిగినా.. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదు?’’ అని హరీశ్ రావు నిలదీశారు.
‘‘మ్యానిఫెస్టో పేరుతో మాయమాటలు చెప్పి.. అధికారంలోకి వచ్చాక హామీల అమలును పూర్తిగా గాలికొదిలేశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించి, గద్దెనెక్కాక ఒక్కొక్క హామీకి తూట్లు పొడిచారు’’ అని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిశితంగా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హరీశ్ రావు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.




