Rythu Bharosa: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..అకౌంట్లలోకి డబ్బులు!
Rythu Bharosa: తెలంగాణ యాసంగి సీజన్ రైతు భరోసా పెట్టుబడి సాయంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం.
Rythu Bharosa: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..అకౌంట్లలోకి డబ్బులు!
Rythu Bharosa: తెలంగాణలో యాసంగి వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాంగం చూపు అంతా ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా పెట్టుబడి సాయం వైపే ఉత్కంఠగా నెలకొంది. ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూతనిస్తున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ. 12,000 సాయాన్ని రెండు విడతల్లో అందిస్తోంది. తొలి విడత వానాకాలం సాయం ఇప్పటికే అందగా, ఇప్పుడు రెండో విడత యాసంగి నిధుల విడుదల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.
ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా ఆశించిన రీతిలో వర్షాలు కురవక, నీటి ఎద్దడి వల్ల చాలా ప్రాంతాల్లో రైతులు పంట సాగు చేపట్టలేకపోయారు. గతంలో కేవలం పంట సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తాం అని ప్రభుత్వం స్పష్టం చేయడంతో, పంట వేయని తమ ఖాతాల్లో ఈ సారి డబ్బులు పడవని రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే చేసి సాగు భూములను గుర్తించే పనిలో పడటంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది.
రైతుల కష్టాలు, కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ అత్యంత కీలకమైన, ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎల్నినో వంటి ప్రకృతి విపత్తుల వల్ల పంటలు సాగు చేయలేకపోయిన రైతులకు కూడా ఈ యాసంగి సీజన్లో రైతు భరోసా అందించాలని ప్రభుత్వం నిశ్చయించింది.
సాగు విస్తీర్ణంతో లేదా పంట వేయకపోవడంతో సంబంధం లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ నగదు జమ చేయాలని సర్కార్ భావిస్తోంది. గత వానాకాలం సీజన్లో ప్రభుత్వం 1.48 కోట్ల ఎకరాలకు గాను రూ. 8,759 కోట్లను విడుదల చేసి, సుమారు 70.40 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. ఈ యాసంగిలోనూ అదే స్థాయిలో రైతులకు నిధులు జమ కానున్నాయి.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి రూ. 10,000 అందించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ. 12,000కు పెంచిన సంగతి తెలిసిందే. నిబంధనల పేరుతో ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకోవడంపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
త్వరలోనే రైతు భరోసా నిధుల విడుదల తేదీలపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏది ఏమైనా, వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ రైతులకు ఈ వార్త పెద్ద ఊరటనిచ్చే అంశం.




