Telangana: బెంగళూరు స్కిల్ సమ్మిట్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన టాస్క్
Telangana: బెంగళూరు స్కిల్ సమ్మిట్-2026లో తెలంగాణ టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. యువతకు ఏఐ, ఇండస్ట్రీ 4.0 నైపుణ్యాలు, ఉద్యోగావకాశాలే లక్ష్యమని వెల్లడి.
Telangana: బెంగళూరు స్కిల్ సమ్మిట్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన టాస్క్
తెలంగాణ: తెలంగాణ యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా టాస్క్ కృషి చేస్తోందని టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు. బెంగళూరులో నవంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక బెంగళూరు స్కిల్ సమ్మిట్–2026లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి భాగస్వామిగా పాల్గొంది.
ఈ సదస్సులో టాస్క్ సీఈఓ నితిన్ కుమార్ రెడ్డితో కలిసి సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలంగాణకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత విద్యార్హతలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇండస్ట్రీ 4.0, డీప్ టెక్నాలజీ వంటి ఆధునిక రంగాల్లో నైపుణ్యాలు సాధించాలని సూచించారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించి, శిక్షణ పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్లేస్మెంట్ కార్యక్రమాలను బలోపేతం చేయాలని తెలిపారు. బెంగళూరు స్కిల్ సమ్మిట్ వంటి వేదికల ద్వారా ప్రముఖ కంపెనీలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు పెంపొందించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువతకు సైతం నాణ్యమైన నైపుణ్య శిక్షణ, మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందించేందుకు టాస్క్ నిరంతరం కృషి చేస్తోందన్నారు.
ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థల సమన్వయంతో తెలంగాణ యువతను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టాస్క్ సీఈఓ నితిన్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.




