Amit Shah: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌ను గద్దె దించాల్సిందే..!

Amit Shah: హైదరాబాద్ బిజెపి మహాపాదయాత్ర సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి సర్కార్‌కు కౌంటర్, చొరబాటుదారుల ఓట్లపై తీవ్ర విమర్శలు.

Arun Chilukuri
Published on: 2 Nov 2026 5:23 PM IST
Amit Shah
X

Amit Shah: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌ను గద్దె దించాల్సిందే..!

Amit Shah: తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు కదం తొక్కాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'మహా పాదయాత్ర' ముగింపు సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలా వద్దా అని సభకు హాజరైన వేలాది మంది జనసందోహాన్ని ప్రశ్నించిన ఆయన, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, అరాచక పాలనకు ముగింపు పలకడానికి ప్రతీ కార్యకర్త సంకల్పం తీసుకోవాలని కోరారు. ఆనాడు నిజాం మెడలు వంచి హైదరాబాద్‌కు విముక్తి ప్రసాదించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో బీజేపీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న 'ఓటు బచావో' ర్యాలీలపై అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్నది 'ఓటు బచావో' ర్యాలీ కాదని, అది కేవలం దేశంలోకి అక్రమంగా వచ్చిన చొరబాటుదారులను కాపాడే ర్యాలీ అని ఎద్దేవా చేశారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా సరే, దేశంలో ఉన్న చొరబాటుదారులకు ఓటు హక్కు లభించనివ్వబోమని హెచ్చరించారు.

దేశంలో చనిపోయిన వారి ఓట్లను, కోటికి పైగా ఉన్న నకిలీ ఓట్లను మరియు దేశంలో లేని 3 కోట్లకు పైగా ఉన్న చొరబాటుదారుల ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలా వద్దా అని ప్రశ్నించారు. ఎస్‌ఐఆర్ (SIR) వల్లే తాము గెలిచామని కాంగ్రెస్ నిరంతరం ఆరోపిస్తోందని, కానీ 2014, 2019 సాధారణ ఎన్నికల సమయంలో ఎస్‌ఐఆర్ లేకపోయినా నరేంద్ర మోదీ గెలవలేదా అని ప్రశ్నించారు. గడచిన కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీకి ప్రజల్లో ఆదరణ నిరంతరం పెరుగుతోందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.