Xiaomi 18 Pro: 200MP కెమెరాతో షావోమీ కొత్త ఫోన్.. డిసెంబర్‌లోనే ఇండియాలోకి?

షావోమీ అభిమానులకు మరోసారి ఫ్లాగ్‌షిప్ ఫోన్ల సందడి కనిపించే అవకాశం ఉంది. షావోమీ 18 ప్రో, షావోమీ 18T స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

CR Reddy
Published on: 10 Nov 2026 9:17 AM IST
Xiaomi 18 Pro
X

Xiaomi 18 Pro

Xiaomi 18 Pro: షావోమీ అభిమానులకు మరోసారి ఫ్లాగ్‌షిప్ ఫోన్ల సందడి కనిపించే అవకాశం ఉంది. షావోమీ 18 ప్రో, షావోమీ 18T స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా 200 మెగాపిక్సెల్ కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. షావోమీ 18 ప్రోను డిసెంబర్‌లో భారత్‌లో విడుదల చేయవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ రెండు ఫోన్ల భారత విడుదల తేదీ, ధరలను షావోమీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం బయటకు వచ్చిన వివరాలను లీకులుగానే చూడాలి.

డిసెంబర్‌లో షావోమీ 18 ప్రో విడుదలయ్యే ఛాన్స్

టెక్ వెబ్‌సైట్‌లలో వచ్చిన తాజా సమాచారం ప్రకారం షావోమీ 18 ప్రోను 2026 డిసెంబర్‌లో భారత మార్కెట్లోకి తీసుకురావచ్చని తెలుస్తోంది. సెప్టెంబర్ 23న చైనాలో ఈ ఫోన్‌ను విడుదల చేసిన షావోమీ, భారత్‌లోనూ అందుబాటులోకి తీసుకొస్తామని సంకేతాలిచ్చింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో కంపెనీ ప్రతినిధి కూడా ఈ ఫోన్ భారత విడుదలను ధ్రువీకరించినట్లు టెక్ నివేదికలు పేర్కొన్నాయి. అయితే డిసెంబర్‌లో ఏ తేదీన విడుదల చేస్తారు? ధర ఎంత ఉంటుంది? అనే వివరాలు ఇంకా వెల్లడించలేదు. భారత్‌లో చివరిసారిగా షావోమీ 13 ప్రోను 2023 ఫిబ్రవరిలో విడుదల చేశారు. ఆ తర్వాత మళ్లీ ప్రో మోడల్ రానుండటంతో ఈ ఫోన్‌పై ఆసక్తి పెరిగింది.

షావోమీ 18Tలో 200MP కెమెరా

షావోమీ 18Tకు సంబంధించి కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్‌లో 1.5K రిజల్యూషన్‌తో LTPS OLED డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం. దీని రిఫ్రెష్ రేట్ 165Hz లేదా 185Hz వరకు ఉండే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ రెండు అంకెల్లో ఏది ఖరారవుతుందనేది స్పష్టత లేదు. పనితీరు కోసం ఇంకా అధికారికంగా విడుదల కాని మీడియాటెక్ డైమెన్సిటీ 8600 చిప్‌సెట్‌ను ఉపయోగించవచ్చని అంచనా. దీనికి LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ జత చేయవచ్చని తెలుస్తోంది. ఈ వివరాలన్నీ ప్రస్తుతానికి లీకుల ఆధారంగానే వెలుగులోకి వచ్చాయి.

ఆండ్రాయిడ్ 17తో షావోమీ 18T?

ఫొటోగ్రఫీ కోసం షావోమీ 18Tలో లైకా ట్యూనింగ్‌తో కూడిన మూడు వెనుక కెమెరాలు ఇవ్వవచ్చని సమాచారం. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలు ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇవ్వవచ్చని అంచనా. సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్ 17 ఆధారిత HyperOS 4 అందించే అవకాశం ఉంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP69 రేటింగ్ కూడా ఉండొచ్చని సమాచారం. అయితే కెమెరాల పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ వేగం వంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

షావోమీ 18 ప్రోలో వెనుక మరో స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణ

చైనాలో విడుదలైన షావోమీ 18 ప్రోలో 6.4 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 1,120 × 2,436 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 2.7 అంగుళాల మరో AMOLED స్క్రీన్ ఉండటం ప్రత్యేకత. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్, 7,000mAh బ్యాటరీ ఉన్నాయి. చైనా మోడల్‌లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నట్లు వివరాలు వెల్లడయ్యాయి. అయితే భారత్‌లో విడుదలయ్యే మోడల్‌లోనూ ఇవే ఫీచర్లు ఉంటాయా? ధర ఎంత నిర్ణయిస్తారు? అనేది కంపెనీ అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టమవుతుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.