వాట్సాప్ బిజినెస్ యూజర్లకు షాక్.. అక్టోబర్ 1 నుంచి మెసేజ్‌లకు ఛార్జీలు

వాట్సాప్ బిజినెస్ ఉపయోగించే సంస్థలకు మెటా కీలక మార్పు తీసుకొస్తోంది. ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న కొన్ని సర్వీస్ మెసేజ్‌లకు అక్టోబర్ 1, 2026 నుంచి ఛార్జీలు

G Krishna
Published on: 30 Sept 2026 2:44 PM IST
whatsapp
X

whatsapp

వాట్సాప్ బిజినెస్ ఉపయోగించే సంస్థలకు మెటా కీలక మార్పు తీసుకొస్తోంది. ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న కొన్ని సర్వీస్ మెసేజ్‌లకు అక్టోబర్ 1, 2026 నుంచి ఛార్జీలు విధించనున్నట్లు ప్రకటించింది. అంటే వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్లకు పంపే కొన్ని మెసేజ్‌లకు ఇకపై ఒక్కో మెసేజ్ చొప్పున వ్యాపార సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెటింగ్, యుటిలిటీ, ఆథెంటికేషన్ టెంప్లేట్ మెసేజ్‌లకు మెటా ఛార్జీలు వసూలు చేస్తోంది. అయితే టెంప్లేట్ అవసరం లేని సర్వీస్ మెసేజ్‌లు మాత్రం 2024 నవంబర్ 1 నుంచి ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉచిత సర్వీస్ కూడా అక్టోబర్ 1 నుంచి పెయిడ్ సర్వీస్‌గా మారనుంది. ఈ మార్పులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కస్టమర్‌తో 24 గంటల కస్టమర్ సర్వీస్ విండో ఓపెన్‌గా ఉన్న సమయంలో పంపే కొన్ని యుటిలిటీ మెసేజ్‌లకు కూడా ఇకపై ఛార్జీలు వర్తిస్తాయి. గతంలో ఈ సమయంలో పంపే యుటిలిటీ మెసేజ్‌లకు కొన్ని సందర్భాల్లో ఛార్జీలు ఉండేవి కావు.

సర్వీస్ మెసేజ్ అంటే ఏంటి?

కస్టమర్‌తో 24 గంటల సర్వీస్ విండో ఓపెన్‌గా ఉన్నప్పుడు వ్యాపార సంస్థ తరఫున పంపే టెంప్లేట్ కాని రిప్లైలను సర్వీస్ మెసేజ్‌లు అంటారు. వీటిని సాధారణంగా కస్టమర్ సర్వీస్ ప్రతినిధి లేదా థర్డ్‌పార్టీ ఏఐ సిస్టమ్ ద్వారా పంపవచ్చు. అయితే వ్యాపారం తనంతట తాను కొత్త సంభాషణను ప్రారంభించేందుకు ఈ మెసేజ్‌లను ఉపయోగించుకోలదు. అక్టోబర్ 1 నుంచి ఛార్జీలు అమల్లోకి రానున్న నేపథ్యంలో వ్యాపారాలు సెప్టెంబర్ 30లోపు తమ అకౌంట్‌లో పేమెంట్ మెథడ్‌ను నమోదు చేసుకోవాలని మెటా తెలిపింది. అలా చేయని సొల్యూషన్ ప్రొవైడర్లు లేదా నేరుగా ఇంటిగ్రేట్ అయిన వ్యాపారాల సర్వీస్ మెసేజ్‌లను అక్టోబర్ 1 నుంచి డెలివర్ చేయబోమని కంపెనీ హెచ్చరించింది.

ఇండియాలో ఎంత ఛార్జ్?

సర్వీస్ మెసేజ్‌ల ధర ప్రతి మార్కెట్‌కు అనుగుణంగా మారుతుంది. భారత్‌లో వీటికి వర్తించే రేటు యుటిలిటీ, ఆథెంటికేషన్ మెసేజ్‌ల రేటుతో సమానంగా ఉంటుందని మెటా తెలిపింది. ఇండియాలో మెటా బిజినెస్ ఏజెంట్ అకౌంట్లకు బిల్లింగ్ కరెన్సీగా భారతీయ రూపాయి (INR)ను ఉపయోగిస్తారు.

ఏఐ మెసేజ్‌లకు ప్రత్యేక ఛార్జ్

మెటా బిజినెస్ ఏజెంట్ మెసేజ్‌లకు ఇప్పటికే ఛార్జీలు అమల్లో ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి వీటికి టోకెన్ ఆధారిత ఛార్జింగ్ విధానాన్ని మెటా ప్రారంభించింది. ఇందులో ఏఐ ప్రాసెసింగ్, మెసేజ్ డెలివరీ రెండింటినీ కలిపి ఛార్జ్ చేస్తారు. మెటా ప్రకారం గ్లోబల్ రేట్ 10 లక్షల టోకెన్లకు 2 డాలర్లు. సాధారణంగా ఒక మెసేజ్‌కు సుమారు 20,000 నుంచి 25,000 టోకెన్లు ఉపయోగించవచ్చు. దీని ప్రకారం ఒక్క మెసేజ్‌కు దాదాపు 4–5 సెంట్ల వరకు ఖర్చు కావచ్చు. అయితే ఎక్కువ కాంప్లెక్స్‌గా ఉండే ఏఐ సంభాషణలకు మరిన్ని టోకెన్లు అవసరం కావడంతో ఖర్చు కూడా పెరగవచ్చు.

ఒకే మెసేజ్‌కు రెండుసార్లు ఛార్జ్ లేదు

అక్టోబర్ 1 నుంచి ప్రతి టెంప్లేట్ కాని బిజినెస్ మెసేజ్ సర్వీస్ లేదా మెటా బిజినెస్ ఏజెంట్ కేటగిరీలోకి వస్తుంది. మనిషి లేదా థర్డ్‌పార్టీ ఏఐ సిస్టమ్ ద్వారా ఇచ్చిన రిప్లై సర్వీస్ మెసేజ్‌గా పరిగణించి ఒక్కో మెసేజ్‌కు ఛార్జ్ చేస్తారు. మెటా బిజినెస్ ఏజెంట్ ద్వారా వచ్చిన రిప్లైలకు టోకెన్ ఆధారిత ఛార్జ్ వర్తిస్తుంది. అయితే ఒకే మెసేజ్‌కు రెండు రకాలుగా ఛార్జ్ చేయబోమని మెటా స్పష్టం చేసింది.

ఇక సంభాషణ ఖర్చు పెరగొచ్చు

మెటా ఇచ్చిన ఉదాహరణ ప్రకారం, ఒక కస్టమర్ సంభాషణలో ఒక మార్కెటింగ్ మెసేజ్, రెండు మెటా బిజినెస్ ఏజెంట్ రిప్లైలు, ఒక సర్వీస్ రిప్లై, ఒక యుటిలిటీ మెసేజ్ ఉంటే అక్టోబర్ 1 నుంచి మొత్తం ఐదు ఛార్జీలు వర్తించవచ్చు. గత విధానంలో ఇదే సంభాషణలో కేవలం మార్కెటింగ్ మెసేజ్‌కు మాత్రమే ఛార్జ్ ఉండేది. దీంతో కస్టమర్ సపోర్ట్ కోసం వాట్సాప్ బిజినెస్‌ను ఎక్కువగా ఉపయోగించే సంస్థలు ఇకపై తమ మెసేజింగ్ ఖర్చులను కూడా బడ్జెట్‌లో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.