Truecaller: ట్రూ కాలర్‌లో మీ నంబర్ సెర్చ్ చేస్తే మీ వివరాలు కనిపిస్తున్నాయా? ఇలా తొలగించేయండి
మీ మొబైల్ నంబర్‌ను ట్రూ కాలర్‌లో సెర్చ్ చేస్తే మీ పేరు, ప్రొఫైల్ ఫొటో కనిపిస్తున్నాయా? ఇతరులు ఇచ్చే పేర్ల సూచనలు, స్పామ్ రిపోర్టులు మీ నంబర్ గుర్తింపును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం.
Truecaller
Truecaller: స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ట్రూ కాలర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వస్తే వెంటనే ఈ యాప్‌లో సెర్చ్ చేసి ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసుకుంటారు. అయితే మీరు ఎప్పుడైనా మీ సొంత మొబైల్ నంబర్‌ను ట్రూ కాలర్‌లో వెతికారా? అలా సెర్చ్ చేసినప్పుడు మీ పేరు, ప్రొఫైల్ ఫొటోతో పాటు మరికొన్ని వివరాలు కనిపించే అవకాశం ఉంది. అయితే ప్రతి ఒక్కరికీ మీ పూర్తి వ్యక్తిగత సమాచారం కనిపిస్తుందని అనుకోవద్దు. మీ ప్రొఫైల్‌లో మీరు ఇచ్చిన వివరాలు, వాటి కనిపించేలా అనుమతించిన సెట్టింగులపై ఇది ఆధారపడి ఉంటుంది.
ట్రూ కాలర్‌లో నంబర్ సెర్చ్ చేస్తే ఏ వివరాలు కనిపిస్తాయి?
ఎవరైనా మీ మొబైల్ నంబర్‌ను ట్రూ కాలర్‌లో సెర్చ్ చేస్తే ముందుగా ఆ నంబర్‌కు అనుసంధానమైన పేరు కనిపించవచ్చు. మీరు ప్రొఫైల్‌లో ఫొటో, ఈమెయిల్, లింగం, ఇతర వివరాలు ఇచ్చి ఉంటే.. వాటిలో కొన్ని మీ ప్రైవసీ సెట్టింగులను బట్టి ఇతరులకు కనిపించవచ్చు. అయితే మీ పూర్తి వివరాలు అందరికీ కనిపిస్తాయని కాదు. ట్రూ కాలర్ ప్రకారం, యూజర్ల ప్రొఫైల్ వివరాలు సాధారణంగా ప్రైవేట్‌గానే ఉంటాయి. ఎవరు ఏ సమాచారం చూడాలనే దానిపై యూజర్లకు నియంత్రణ ఉంటుంది.
మీ పేరు ట్రూ కాలర్‌కు ఎలా తెలుస్తుంది?
మీ నంబర్‌కు ఏ పేరు చూపించాలనేది ఒక్క మీరే నిర్ణయించరు. ట్రూ కాలర్‌లో మీరు నమోదు చేసిన ప్రొఫైల్ వివరాలతో పాటు ఇతర యూజర్లు ఇచ్చే సూచనలు, ఫీడ్‌బ్యాక్ కూడా నంబర్ గుర్తింపులో పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు.. చాలామంది ఒక నంబర్‌ను స్పామ్ కాల్‌గా రిపోర్ట్ చేస్తే ఆ నంబర్ పక్కన స్పామ్ అలర్ట్ కనిపించవచ్చు. అలాగే ఇతరులు ఇచ్చిన పేర్ల సూచనలు కూడా కాలర్ ఐడీ సమాచారాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే కొన్నిసార్లు మీ నంబర్‌కు తప్పు పేరు కనిపించే అవకాశం ఉంటుంది.
మీ ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్ అందరికీ కనిపిస్తుందా?
చాలామందికి ఉండే మరో సందేహం ఇదే. ట్రూ కాలర్‌కు కాంటాక్ట్స్ అనుమతి ఇచ్చినంత మాత్రాన మీ ఫోన్‌బుక్‌లోని పేర్లు, నంబర్లన్నీ ఇతరులకు బహిరంగంగా కనిపిస్తాయని కాదు. భారతదేశం కోసం అందుబాటులో ఉన్న తన ప్రైవసీ వివరాల్లో కాంటాక్ట్ సమాచారం ఫోన్లోనే ప్రాసెస్ అవుతుందని, దాన్ని అప్లోడ్ చేసి ఇతరులకు పబ్లిక్ చేయబోమని కంపెనీ చెబుతోంది. అయితే ఇతర యూజర్లు ఇచ్చే ఫీడ్‌బ్యాక్, ప్రొఫైల్ వివరాలు, స్పామ్ రిపోర్టుల ఆధారంగా నంబర్ గుర్తింపు రూపొందవచ్చు.
ట్రూ కాలర్ నుంచి మీ నంబర్‌ను ఎలా తొలగించాలి?
మీ నంబర్ ట్రూ కాలర్‌లో సెర్చ్ చేసినప్పుడు కనిపించకూడదనుకుంటే ముందుగా యాప్‌లోని అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయాలి. ఇందుకోసం ట్రూ కాలర్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ఐకాన్‌పై నొక్కండి. తర్వాత Settingsలోకి వెళ్లి Privacy Center ఆప్షన్ ఓపెన్ చేయండి. అక్కడ Deactivate Accountపై క్లిక్ చేసి స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి. ఆ తర్వాత బ్రౌజర్లో ట్రూ కాలర్ అధికారిక అన్‌లిస్టింగ్ పేజీని తెరవాలి. ఈ లింక్‌పై క్లిక్ చేయండి. దేశ కోడ్‌తో సహా మీ మొబైల్ నంబర్ నమోదు చేసి, క్యాప్చా పూర్తి చేసి Unlist ఎంపికను ఎంచుకోవాలి. కంపెనీ సమాచారం ప్రకారం, నంబర్ తొలగింపు ప్రక్రియకు 24 గంటల వరకు పట్టవచ్చు. అయితే స్పామ్‌గా గుర్తించిన నంబర్లను అన్‌లిస్ట్ చేయడం సాధ్యం కాదు.
నంబర్ తొలగిస్తే ఈ సదుపాయాలు ఉండవు
ట్రూ కాలర్ నుంచి నంబర్‌ను అన్‌లిస్ట్ చేసిన తర్వాత ఆ నంబర్ ద్వారా కాలర్ ఐడీ, స్పామ్ రక్షణ వంటి సదుపాయాలు అందుబాటులో ఉండవు. అలాగే ఈ ప్రక్రియను తిరిగి మార్చడం సాధ్యం కాదని కంపెనీ తన వెబ్సైట్లో స్పష్టం చేసింది. కాబట్టి నంబర్ తొలగించే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. మీ నంబర్‌ను పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేకపోతే ముందుగా Privacy Centerలో ప్రొఫైల్ వివరాలు, వాటి కనిపించే విధానాన్ని పరిశీలించి అవసరమైన మార్పులు చేసుకోవచ్చు.




