Mobile Addiction: ఫోన్ ఇస్తే చాలు ఇళ్లంతా సైలెంట్.. కానీ పిల్లల మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

Mobile Addiction: సౌకర్యాలు పెరిగిన కొద్దీ ఆధునిక సమాజంలో పిల్లల బాల్యం ఎలా కనుమరుగవుతుందో ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

CR Reddy
Published on: 16 Nov 2026 8:42 AM IST
Children Screen Time
X

Children Screen Time

Mobile Addiction: సౌకర్యాలు పెరిగిన కొద్దీ ఆధునిక సమాజంలో పిల్లల బాల్యం ఎలా కనుమరుగవుతుందో ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అలసిపోయి ఇంటికి వచ్చే తల్లిదండ్రులు పిల్లల అల్లరిని భరించలేక వారి చేతిలో స్మార్ట్‌ఫోన్ పెడుతున్నారు. క్షణంలో కార్టూన్లు ప్రత్యక్షం కాగానే ఇళ్లు నిశ్శబ్దంగా మారుతుంది. అయితే ఈ కొద్దిసేపటి ప్రశాంతత వెనుక పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీసే పెద్ద ప్రమాదం దాగి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పిల్లలు స్క్రీన్ల ముందు గడుపుతున్న సమయంపై కనీసం సరైన జాతీయ గణాంకాలు కూడా లేకపోవడం గమనార్హం.

ఆర్థిక సర్వే హెచ్చరికలు, తల్లిదండ్రుల ఆందోళనలు

భారత ప్రభుత్వ ఆర్థిక సర్వే కూడా పిల్లలు, యువతలో పెరుగుతున్న డిజిటల్ లిట్రసీ పై ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలు మొబైల్స్‌కు బానిస కావడం వల్ల వారిలో ఏకాగ్రత తగ్గడమే కాకుండా మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని సర్వే స్పష్టం చేసింది. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలకు పిల్లలు సులభంగా బలవుతున్నారు. ప్రముఖ కమ్యూనిటీ ప్లాట్‌ఫారమ్ నిర్వహించిన సర్వే ప్రకారం దాదాపు ప్రతి ఇద్దరు తల్లిదండ్రుల్లో ఒకరు తమ పిల్లలు సోషల్ మీడియా లేదా గేమింగ్‌కు బానిసవుతున్నారని భావిస్తున్నారు. ఇది కేవలం అనుమానం కాదు, ప్రతి ఇంటా కనిపిస్తున్న కఠిన సత్యం.

ఖాళీ సమయం లేకపోతే ఊహలకు తెరపడినట్టే

ఒకప్పుడు పిల్లలు ఖాళీ సమయాల్లో రకరకాల ఆటలు ఆడుకుంటూ తమకంటూ ఒక లోకాన్ని సృష్టించుకునేవారు. ఖాళీ సమయం లేదా బోరింగ్ అనేది పిల్లల సృజనాత్మకతకు పునాది. అప్పుడే వారిలో కొత్త ఆలోచనలు, ఊహాశక్తి పెరుగుతాయి. కానీ నేడు స్క్రీన్ ప్రతి సెకనుకూ కొత్తదనాన్ని, తక్షణ ఆనందాన్ని ఇస్తోంది. దీనివల్ల పిల్లల్లో సహనం, వేచి చూసే గుణం పూర్తిగా కనుమరుగవుతున్నాయి. ఏ క్షణమూ ఖాళీగా ఉండకుండా స్క్రీన్‌కు అతుక్కుపోవడం వల్ల పిల్లల మెదడు సహజంగా ఎదగాల్సిన తీరు దెబ్బతింటోంది.

నిద్రలేమి సమస్యలు, పెద్దల బాధ్యత

స్క్రీన్ అడిక్షన్ వల్ల పిల్లల్లో నిద్రలేమి ప్రధాన సమస్యగా మారుతోంది. రాత్రి సమయాల్లో ఫోన్లతో గడపడం వల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. పిల్లలు తాము విన్నదాని కంటే పెద్దలు చేసే పనుల నుంచే ఎక్కువగా నేర్చుకుంటారు. భోజనం చేసేటప్పుడు కూడా పెద్దలు ఫోన్లు పట్టుకుంటే పిల్లలు అదే అలవాటును అనుసరిస్తారు. కాబట్టి మొబైల్ పిచ్చి నుంచి పిల్లలను కాపాడుకోవాలంటే ముందుగా పెద్దలు తమ స్క్రీన్ టైమ్‌ను తగ్గించుకోవాలి. పిల్లలకు ఖాళీ సమయం ప్రాముఖ్యతను నేర్పిస్తూ వారిని బయట ఆడేలా ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.