Mobile Revolution: పల్లెల్లో పెరుగుతున్న హై-స్పీడ్ ఇంటర్నెట్ క్రేజ్.. మొబైల్స్ డేటా వాడకంలో రికార్డులు
Mobile Revolution: గ్రామీణ భారతదేశంలో మొబైల్ ఫోన్ల వాడకంలో ఊహించని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
Mobile Revolution
Mobile Revolution: గ్రామీణ భారతదేశంలో మొబైల్ ఫోన్ల వాడకంలో ఊహించని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దం క్రితం వరకు పల్లెల్లో మొబైల్ ఫోన్ అంటే కేవలం బంధువులతో మాట్లాడటానికి బాగోగులు తెలుసుకోవడానికి మాత్రమే పరిమితమయ్యేది. కానీ కాలం మారుతున్న కొద్దీ ప్రజల అవసరాలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు గ్రామాల్లోని ప్రజలు కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడటానికే కాకుండా, హై-స్పీడ్ ఇంటర్నెట్ వాడటానికి, ఆన్లైన్ సేవలను పొందడానికి వ్యవసాయం, వ్యాపార పనుల కోసం మొబైల్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ట్రాయ్ గణాంకాల ప్రకారం.. దేశంలోని మొత్తం మొబైల్ వినియోగదారుల్లో 42 నుంచి 45 శాతం వరకు గ్రామీణ ప్రాంతాల నుంచే ఉండటం విశేషం.
టెక్నాలజీ పుణ్యమా అని పల్లెల్లో ల్యాండ్‌ఫోన్ల శకం పూర్తిగా ముగిసి, మొబైల్, వైర్లెస్ ఇంటర్నెట్ రాజ్యమేలుతోంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ వంటి ప్రముఖ టెలికాం కంపెనీలు గ్రామాల్లో నెట్వర్క్ విస్తరణను వేగవంతం చేశాయి. జియో నెట్‌వర్క్‌లో వినియోగవుతున్న మొత్తం ఇంటర్నెట్ డేటాలో దాదాపు 46 శాతం కేవలం గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తోందంటే పరిస్థితి ఎంత వేగంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎయిర్టెల్ సంస్థ కూడా గడచిన కొన్ని సంవత్సరాల్లో వేలాది కొత్త నెట్వర్క్ సైట్లను ఏర్పాటు చేసి కోట్లాది మంది గ్రామీణ ప్రజలకు 4G, 5G సేవలను అందుబాటులోకి తెచ్చింది.
అయితే గ్రామాల్లో ఈ డిజిటల్ విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరైన విద్యుత్ సరఫరా లేకపోవడం, వోల్టేజ్ అప్అండ్ డౌన్ సమస్యలు టెలికాం టవర్ల నిర్వహణకు పెద్ద అడ్డంకిగా మారుతున్నట్లు వొడాఫోన్ ఐడియా, ఇతర సంస్థలు చెబుతున్నాయి. ఇటువంటి సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం డిజిటల్ భారత్ నిధి వంటి ప్రత్యేక నిధులతో మారుమూల గ్రామాలకు సైతం టెలికాం, ఆప్టికల్ ఫైబర్ సేవలను విస్తరించేందుకు నిరంతరం కృషి చేస్తోంది.
రాబోయే రోజుల్లో 5G, ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయం, విద్య, వైద్యం వంటి రంగాలు పూర్తిగా మారిపోనున్నాయి. రైతులు తమ పంటల సమాచారాన్ని ఆన్లైన్లో తెలుసుకోవడం, విద్యార్థులు డిజిటల్ క్లాసులు వినడం వంటి అనేక పనులకు ఈ హై-స్పీడ్ ఇంటర్నెట్ ఎంతో ఉపయోగపడుతోంది. కేవలం కమ్యూనికేషన్ సాధనంగా ఉన్న మొబైల్ ఫోన్, నేడు పల్లెవాసుల జీవితాలను సమూలంగా మార్చే పవర్ఫుల్ సాధనంగా మారుతుండటం నిజంగా అభినందించదగ్గ పరిణామం.




