లాక్ తీయగానే ఫుల్‌స్క్రీన్ యాడ్స్ వస్తున్నాయా..? ఈ 5 సెట్టింగ్స్ చెక్ చేయండి
Unwanted ads on phone: స్మార్ట్‌ఫోన్‌లో అకస్మాత్తుగా ఫుల్‌స్క్రీన్ యాడ్స్ కనిపించడం యూజర్లకు ఇబ్బందికరంగా మారుతుంది. అయితే కొన్ని సింపుల్ సెట్టింగ్స్‌ను పరిశీలించడం ద్వారా సమస్యకు కారణాన్ని గుర్తించే అవకాశం ఉంది.
లాక్ తీయగానే ఫుల్‌స్క్రీన్ యాడ్స్ వస్తున్నాయా..? ఈ 5 సెట్టింగ్స్ చెక్ చేయండి
unwanted ads on phone: స్మార్ట్‌ఫోన్ (Smartphone)లో అకస్మాత్తుగా యాడ్స్ కనిపించడం సాధారణ విషయం కాదు. ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న సమయంలోనే కాకుండా ఫోన్ లాక్ తీసిన వెంటనే ఫుల్‌స్క్రీన్ యాడ్స్ రావడం మొదలైతే.. దాని వెనుక ఏదైనా అనుమానాస్పద యాప్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటీవల డౌన్లోడ్ చేసిన థర్డ్-పార్టీ యాప్‌లు, బ్రౌజర్ నోటిఫికేషన్ పర్మిషన్లు ఈ సమస్యకు కారణం కావచ్చు.
అయితే వెంటనే ఫోన్‌ను రీసెట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సెట్టింగ్స్‌ను ఒక్కొక్కటిగా పరిశీలించడం ద్వారా యాడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించే ప్రయత్నం చేయవచ్చు. ఇందుకోసం ముందుగా ఫోన్లో ఇటీవల ఇన్స్టాల్ చేసిన యాప్‌లను చెక్ చేయడం మంచిది.
ఇటీవల ఇన్స్టాల్ చేసిన యాప్‌లను చెక్ చేయండి..
ఫోన్లో ఒక్కసారిగా యాడ్స్ కనిపించడం మొదలైతే.. ఇటీవల డౌన్లోడ్ చేసిన యాప్‌లను పరిశీలించండి. కొన్ని థర్డ్-పార్టీ యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ యాడ్స్ చూపించే అవకాశం ఉంటుంది.
ఇందుకోసం ఫోన్లోని సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాప్స్ లేదా అప్లికేషన్ మేనేజర్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ ఇటీవల ఇన్స్టాల్ చేసిన లేదా చివరిగా ఉపయోగించిన యాప్‌లను పరిశీలించవచ్చు. అనుమానం కలిగించే యాప్ ఏదైనా ఉంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేయడం ఒక మార్గం.
బ్రౌజర్ నోటిఫికేషన్లను పరిశీలించండి..
వెబ్సైట్లను బ్రౌజ్ చేస్తున్నప్పుడు కనిపించే ‘Allow Notifications’ ఆప్షన్‌ను తెలియకుండానే అనుమతించడం వల్ల కూడా అవాంఛిత నోటిఫికేషన్లు రావచ్చు. ఆ వెబ్సైట్లు తర్వాత ఫోన్ నోటిఫికేషన్ బార్లో యాడ్స్ చూపించే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు గూగుల్ క్రోమ్ (Google Chrome)లో Settings > Site Settings > Notifications విభాగానికి వెళ్లి అనుమతులు పొందిన వెబ్సైట్లను పరిశీలించవచ్చు. అవసరం లేని లేదా గుర్తు తెలియని సైట్లకు ఇచ్చిన అనుమతులను బ్లాక్ లేదా రిమూవ్ చేయాలి.
‘Display over other apps’ పర్మిషన్ చూడండి..
కొన్ని యాప్‌లకు ఇతర యాప్‌లపై కూడా కంటెంట్‌ను చూపించే అనుమతి ఉంటుంది. దీన్ని ‘Display over other apps’ లేదా ‘Special App Access’గా ఫోన్లో చూడవచ్చు. టార్చ్‌లైట్, వాల్‌పేపర్, స్కానర్ వంటి యాప్‌లలో ఏదైనా అనవసరమైన పర్మిషన్ కలిగి ఉంటే దాన్ని పరిశీలించాలి. అవసరం లేని యాప్‌లకు ఈ అనుమతిని డిసేబుల్ చేయడం ద్వారా స్క్రీన్‌పై అనవసరమైన యాడ్స్ కనిపించే సమస్యను గుర్తించే ప్రయత్నం చేయవచ్చు.
సేఫ్ మోడ్‌తో కారణం తెలుసుకోవచ్చు..
ఏ యాప్ సమస్యకు కారణమో తెలియకపోతే సేఫ్ మోడ్ (Safe Mode) ఉపయోగపడుతుంది. ఈ మోడ్‌లో డౌన్లోడ్ చేసిన థర్డ్-పార్టీ యాప్‌లు డిసేబుల్ అవుతాయి.
సాధారణంగా పవర్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేసి పవర్ ఆఫ్ ఆప్షన్‌పై కొంతసేపు నొక్కి ఉంచితే రీబూట్ టూ సేఫ్ మోడ్ ఆప్షన్ కనిపించే అవకాశం ఉంది. ఫోన్‌ను సేఫ్ మోడ్‌లోకి తీసుకెళ్లిన తర్వాత యాడ్స్ రావడం ఆగితే.. ఇటీవల ఇన్స్టాల్ చేసిన యాప్‌లలో ఏదో ఒకటి సమస్యకు కారణమై ఉండొచ్చని గుర్తించవచ్చు.
ఆ తర్వాత ఫోన్‌ను సాధారణ మోడ్‌లోకి తీసుకొచ్చి అనుమానాస్పద యాప్‌లను పరిశీలించి తొలగించవచ్చు.
సెక్యూరిటీ స్కాన్ కూడా చేయండి..
పైన పేర్కొన్న మార్గాలతో సమస్య పరిష్కారం కాకపోతే ఫోన్లోని డిఫాల్ట్ సెక్యూరిటీ స్కానర్‌ను ఉపయోగించవచ్చు. అవసరమైతే నమ్మకమైన మొబైల్ సెక్యూరిటీ యాప్ లేదా మాల్వేర్ స్కానర్‌తో పూర్తి సిస్టమ్‌ను స్కాన్ చేయవచ్చు.
ఫోన్లో ఒక్కసారిగా అవాంఛిత యాడ్స్ కనిపించడం డిజిటల్ సెక్యూరిటీ విషయంలో అప్రమత్తం కావాల్సిన సంకేతంగా చూడవచ్చు. తెలియని లింక్‌లను ఓపెన్ చేయకుండా ఉండటం, అనుమానాస్పద యాప్‌లను డౌన్లోడ్ చేయకపోవడం ద్వారా ఇలాంటి సమస్యలను నివారించే అవకాశం ఉంటుంది.




