9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. వన్ ప్లస్ ఏస్ 7 సిరీస్‌లో ఏ ఫోన్ కొనాలి?

OnePlus Ace 7 vs Ace 7 Pro: వన్ ప్లస్ ఏస్ 7, వన్ ప్లస్ ఏస్ 7 Pro పేర్లతో వచ్చిన ఈ రెండు ఫోన్లలో 9,000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, 185Hz వరకు రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉన్నాయి. అయితే రెండు మోడళ్ల మధ్య కొన్ని కీలక తేడాలు ఉన్నాయి.

Venkat
Published on: 29 Oct 2026 9:15 PM IST
OnePlus Ace 7 vs Ace 7 Pro
X

9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. వన్ ప్లస్ ఏస్ 7 సిరీస్‌లో ఏ ఫోన్ కొనాలి?

OnePlus Ace 7 vs Ace 7 Pro: చైనాలో వన్ ప్లస్ ఏస్ 7, వన్ ప్లస్ ఏస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్లను వన్‌ప్లస్ విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ముఖ్యంగా గేమింగ్‌పై ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. భారీ బ్యాటరీతో పాటు వేగవంతమైన ప్రాసెసర్, ప్రత్యేక కూలింగ్ సిస్టమ్, గేమింగ్ చిప్స్, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు.

ధర ఎంత?

వన్ ప్లస్ ఏస్ 7 ప్రారంభ ధర 4,399 యువాన్లు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.63,000. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌కు ఈ ధర వర్తిస్తుంది. ఇతర వేరియంట్ల ధరలు 4,899 యువాన్ల నుంచి 5,699 యువాన్ల వరకు ఉన్నాయి.

వన్ ప్లస్ ఏస్ 7 Pro ప్రారంభ ధర 4,799 యువాన్లు. అంటే దాదాపు రూ.69,000. ఇందులో 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ ధర 7,299 యువాన్లు, అంటే సుమారు రూ.1.04 లక్షలు.

9,000mAh బ్యాటరీ.. గేమర్లకు ప్లస్ పాయింట్

ఈ సిరీస్‌లో అతిపెద్ద ఆకర్షణ 9,000mAh బ్యాటరీ. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటి పనులు ఎక్కువగా చేసే వారికి ఇది ఎక్కువ బ్యాకప్ ఇవ్వగలదు.

రెండు ఫోన్లలో 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందించారు. గేమింగ్ సమయంలో పవర్‌ను నేరుగా ఫోన్ సిస్టమ్‌కు అందించడంలో ఇది సహాయపడుతుంది. దీంతో బ్యాటరీపై ఒత్తిడి, వేడి తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

185Hz డిస్‌ప్లే..

రెండు మోడళ్లలో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. సాధారణ వినియోగంలో 165Hz వరకు రిఫ్రెష్ రేట్ పనిచేస్తుంది. కొన్ని గేమ్స్‌లో 185Hz వరకు సపోర్ట్ లభిస్తుంది.

అయితే ప్రతి గేమ్ 185Hzను సపోర్ట్ చేయదు. గేమ్‌కు ఆ సపోర్ట్ ఉంటేనే ఈ ఫీచర్ పూర్తి ప్రయోజనం ఇస్తుంది.

వేడి తగ్గించేందుకు ప్రత్యేక కూలింగ్..

ఎక్కువ సమయం గేమింగ్ చేస్తే ఫోన్ వేడెక్కే అవకాశం ఉంటుంది. దీనిని నియంత్రించేందుకు వన్‌ప్లస్ డ్యూయల్ పాథ్ గ్లాసియర్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్‌ను అందించింది. ప్రత్యేక ఎయిర్‌ఫ్లో ఛానళ్లతో ఫోన్‌లో ఉత్పత్తి అయ్యే వేడిని బయటకు పంపేలా దీనిని రూపొందించారు.

గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు T3, G3, P4 అనే మూడు ప్రత్యేక చిప్స్ కూడా ఉన్నాయి. టచ్ స్పందన, నెట్‌వర్క్ కనెక్షన్, డిస్‌ప్లే మూవ్‌మెంట్ వంటి అంశాల్లో ఇవి సహాయపడతాయి.

వన్ ప్లస్ ఏస్ ప్రోలో కెమెరా మరింత బెటర్..

రెండు ఫోన్లలో 200MP మెయిన్ కెమెరా, OIS సపోర్ట్ ఉన్నాయి. దీంతో ఫోటోలు, వీడియోలు తీసే సమయంలో చేతి కదలికల ప్రభావాన్ని తగ్గించవచ్చు.

అయితే ఇక్కడే ఏస్ 7 ప్రో ముందంజలో ఉంటుంది. ఏస్ 7లో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటే, ఏస్ 7 ప్రోలో 50MP టెలిఫోటో కెమెరా ఇచ్చారు. జూమ్ ఫొటోగ్రఫీకి ప్రో మోడల్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రాసెసర్‌లోనూ తేడా

వన్ ప్లేస్ ఏస్ 7లో క్వాల్ క్వమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 వీ సిరీస్ చిప్‌సెట్ ఉంది. ఏస్ 7 ప్రోలో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ అందించారు. రెండు ఫోన్లలో LPDDR5X అల్ట్రా ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 17 ఆధారిత ColorOS 17 పనిచేస్తుంది. 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు రెండు మోడళ్లలో ఉన్నాయి.

ఏది కొనాలి?

భారీ బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు కావాలంటే వన్ ప్లస్ ఏస్ 7 కూడా బలమైన ఎంపిక. అయితే కెమెరా, టెలిఫోటో సామర్థ్యం, మరింత శక్తివంతమైన ప్రాసెసర్, 1TB వరకు స్టోరేజ్ కావాలంటే వన్ ప్లస్ ఏస్ 7 ప్రో స్పష్టంగా ముందుంటుంది. ధరను పరిగణనలోకి తీసుకుంటే Ace 7 విలువైన ఎంపికగా కనిపిస్తే, అత్యుత్తమ పనితీరు కోరుకునే వారికి ఏస్ 7 ప్రో ఆకట్టుకునే మోడల్‌గా నిలుస్తుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.