Claude Mythos India: హ్యాకర్ల పాలిట యముడు ఇదే.. భారత్‌కు వచ్చేసి కొత్త ఏఐ..!

Claude Mythos India: భారత్ సైబర్ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. డిజిటల్ వ్యవస్థల్లోని లోపాలను ముందుగానే గుర్తించి, సైబర్ దాడులను అడ్డుకోవడంలో ఈ AI కీలకంగా మారనుంది.

Venkat
Published on: 4 Nov 2026 7:18 PM IST
Claude Mythos India
X

Claude Mythos India: హ్యాకర్ల పాలిట యముడు ఇదే.. భారత్‌కు వచ్చేసి కొత్త ఏఐ..!

Claude Mythos India: భారత్‌లో డిజిటల్ సేవల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ దాడుల ముప్పు కూడా పెరుగుతోంది. ప్రభుత్వ సంస్థలు, ఆర్థిక వ్యవస్థలు, కీలక డిజిటల్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ సైబర్ భద్రతను బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అమెరికాకు చెందిన ప్రముఖ AI సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) అభివృద్ధి చేసిన క్లాడ్ మైథోస్ (Claude Mythos) AI టూల్‌ను ఉపయోగించుకునే అవకాశం భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)కు లభించింది. ఈ అధునాతన AI సాయంతో డిజిటల్ వ్యవస్థల్లో దాగి ఉన్న భద్రతా లోపాలను గుర్తించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

అసలు క్లాడ్ మైథోస్ ఏం చేస్తుంది?

క్లాడ్ మైథోస్ అనేది ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలపై దృష్టి పెట్టిన అధునాతన AI మోడల్. సాఫ్ట్‌వేర్, డిజిటల్ నెట్‌వర్క్‌లలో ఉండే బలహీనతలను గుర్తించడం, వాటి ద్వారా ఎదురయ్యే ప్రమాదాలను విశ్లేషించడం దీని ప్రత్యేకత. CERT-In ఈ టూల్‌ను ఉపయోగించి భారత డిజిటల్ వ్యవస్థల్లోని లోపాలను ముందుగానే గుర్తించాలని భావిస్తోంది.

ఈటీ టెలికాం నివేదిక ప్రకారం, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే ఈ AI టూల్‌ను వెంటనే అన్ని వ్యవస్థల్లో ఉపయోగించకుండా, ముందుగా దాని సామర్థ్యాలను పరీక్షించాలని CERT-In నిర్ణయించింది.

ఆచితూచి అడుగులు వేస్తున్న CERT-In

ఈ AI టూల్ వినియోగంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పీటీఐ నివేదిక ప్రకారం, ముందుగా పరీక్షించాలనుకున్న అంశాలను ఒక్కొక్కటిగా మైథోస్‌లోకి ప్రవేశపెట్టి దాని పనితీరును పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుందని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

భారత్‌కు ఎలా ఉపయోగపడుతుంది?

సైబర్ దాడి జరిగిన తర్వాత స్పందించడం కంటే, దాడికి కారణమయ్యే లోపాలను ముందుగానే గుర్తించడం ముఖ్యం. క్లాడ్ మైథోస్ సాయంతో ప్రభుత్వ డిజిటల్ నెట్‌వర్క్‌లు, కీలక వ్యవస్థల్లోని భద్రతా లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా సైబర్ దాడులను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది.

హ్యాకర్ల చేతుల్లో పడితే ప్రమాదమే..!

అయితే ఈ AI టెక్నాలజీకి మరో కోణం కూడా ఉంది. సైబర్ భద్రతను మెరుగుపరిచేందుకు ఉపయోగపడే సామర్థ్యాలనే హ్యాకర్లు దాడుల కోసం దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. అందుకే క్లాడ్ మైథోస్‌ను ఎంపిక చేసిన విశ్వసనీయ సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు.

ఇదిలా ఉంటే, CERT-In ఇతర ఏఐ మోడళ్లను కూడా ఉపయోగిస్తోంది. దీనివల్ల ఒకే ఏఐ వ్యవస్థపై ఆధారపడకుండా విభిన్న టెక్నాలజీలతో సైబర్ ముప్పులను విశ్లేషించే అవకాశం ఉంటుంది. మొత్తంగా క్లాడ్ మైథోస్ వినియోగం భారత సైబర్ భద్రతా వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.