WhatsApp: ఫ్రీగా యాప్, యాడ్స్ కూడా లేవు.. అయినా వాట్సాప్ కోట్లు ఎలా సంపాదిస్తోందో తెలుసా?

WhatsApp: స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ తో విడదీయలేని అనుబంధం ఉంటుంది.

Venkat
Published on: 25 Nov 2026 7:40 PM IST
WhatsApp
X

WhatsApp: ఫ్రీగా యాప్, యాడ్స్ కూడా లేవు.. అయినా వాట్సాప్ కోట్లు ఎలా సంపాదిస్తోందో తెలుసా?

WhatsApp: స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ తో విడదీయలేని అనుబంధం ఉంటుంది. 2009లో జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్ కలిసి రూపొందించిన ఈ యాప్, ప్రస్తుతం 200 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ వేదికగా ఎదిగింది. అయితే యూజర్ల నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా, యాప్‌లో కనీసం ఒక్క యాడ్ కూడా చూపించకుండా వాట్సాప్ ఏటా కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తోందనే సందేహం చాలామందికి వస్తుంది. దీని వెనుక ఒక తెలివైన వ్యాపార వ్యూహం దాగి ఉంది.

ప్రారంభంలో 1 డాలర్ ఫీజు ..

ప్రారంభ రోజుల్లో మాజీ యాహూ ఉద్యోగుల సహకారంతో 2,50,000 డాలర్ల నిధులతో మొదలైన వాట్సాప్, తర్వాత సర్వర్ ఖర్చుల కోసం 8 మిలియన్, 52 మిలియన్ డాలర్ల ఫండింగ్ సేకరించింది. తొలినాళ్లలో కొన్ని దేశాల్లో యాప్ డౌన్‌లోడ్‌కు 1 డాలర్, మరికొన్ని చోట్ల ఏడాదికి 1 డాలర్ (ఐఓఎస్‌లో 0.89 నుంచి 0.99 యూరోలు) సబ్‌స్క్రిప్షన్ ఫీజు వసూలు చేసేది. అప్పట్లో ఎస్ఎంఎస్ ఖర్చులతో పోలిస్తే ఇది చౌకగా ఉండటంతో జనం ఆసక్తిగా చెల్లించారు. 2014 నాటికి 60 కోట్ల మంది యూజర్లతో 15.91 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చినా, 2015లో ఒక్కో యూజర్ నుంచి ఏడాదికి సగటున 6 సెంట్లే వచ్చేవి. అయినా లాభాల కంటే యూజర్ల సంఖ్యను పెంచుకోవడానికే వాట్సాప్ ప్రాధాన్యత ఇచ్చింది.

ఫేస్‌బుక్ కొనుగోలుతో మలుపు..

ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ 19 బిలియన్ డాలర్ల నగదు, షేర్లతో కలిపి మొత్తం 21.8 బిలియన్ డాలర్లకు వాట్సాప్‌ను కొనుగోలు చేయడంతో సీన్ మారిపోయింది. కొన్న వెంటనే యూజర్లపై ఉన్న వార్షిక ఫీజును ఫేస్‌బుక్ రద్దు చేసింది. వాట్సాప్ మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉన్నప్పటికీ, ప్రైవసీ పాలసీ మార్పుల ద్వారా యూజర్ల లొకేషన్, కాంటాక్ట్ లిస్టులు, ఫోన్ నంబర్ల లాంటి ప్రవర్తనా సమాచారాన్ని మెటా సేకరించగలిగింది. ఫేస్‌బుక్ ప్రధాన వ్యాపారమైన ప్రకటనల రంగానికి ఈ డేటా బంగారంలా ఉపయోగపడింది.

వాట్సాప్ బిజినెస్ API ద్వారా అసలైన కాసుల వర్షం..

సాధారణ యూజర్లకు ఉచితంగా ఇస్తూనే, ఆదాయం సంపాదించడానికి వాట్సాప్ బిజినెస్ అనే బంగారు గనిని తెరిచింది. దీని ద్వారా పెద్ద కంపెనీలు వెరిఫైడ్ ప్రొఫైల్స్, ఆటోమేటిక్ రిప్లైలు వాడుకోవచ్చు. ఇందులో వాట్సాప్ బిజినెస్ API ప్రధాన ఆదాయ వనరు. జెండెస్క్, ట్విలియో, మెసేజ్‌బర్డ్ లాంటి వేదికల సాయంతో ఎయిర్‌లైన్స్, ఈ-కామర్స్ కంపెనీలు కస్టమర్లకు టికెట్లు, షిప్పింగ్ అలర్ట్‌లు పంపుతున్నాయి. వెయ్యి సంభాషణలు దాటిన తర్వాత, కస్టమర్ మెసేజ్ చేసిన 24 గంటలు గడిచాక పంపే ఒక్కో మెసేజ్‌కు దేశాన్ని బట్టి 5 నుంచి 9 సెంట్ల వరకు వాట్సాప్ వసూలు చేస్తోంది. త్వరలో ప్రత్యేక టూల్స్‌తో 'వాట్సాప్ ప్రీమియం' సబ్‌స్క్రిప్షన్ కూడా రానుంది.

సూపర్ యాప్ దిశగా అడుగులు

కొన్ని నైట్ క్లబ్‌లలో మహిళలకు ఉచిత ప్రవేశం ఇచ్చి వ్యాపారాన్ని పెంచుకున్నట్లే, కోట్లాది మంది యూజర్లను ఫ్రీగా చేర్చుకుని వారిని చేరుకోవడానికి కంపెనీల నుంచి వాట్సాప్ డబ్బు వసూలు చేస్తోంది. ప్రస్తుతం భారత్‌లో విజయవంతంగా నడుస్తున్న పీటుపీ నగదు బదిలీ సేవలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని మెటా భావిస్తోంది. దీనివల్ల వ్యాపారాలు తమ ఉత్పత్తులను చూపించడం, కస్టమర్లతో మాట్లాడటం, పేమెంట్స్ తీసుకోవడం అన్నీ వాట్సాప్‌లోనే జరిగిపోయి, ఇది ఒక సంపూర్ణ సూపర్ యాప్‌గా మారనుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.