రూమ్ హీటర్లు వేస్ట్.. హీటెడ్ బ్లాంకెట్‌తో చలికి చెక్ పెట్టేయండి.. ధరెంతంటే?

Heated Blanket: చలికాలం మొదలైంది, చాలామంది రూమ్ హీటర్లు కొంటున్నారు. కానీ మీకు హీటెడ్ బ్లాంకెట్ (ఎలక్ట్రిక్ దుప్పటి) అనే మరో ఆప్షన్ కూడా ఉందని తెలుసా..? అయితే కొనే ముందు భద్రతా అంశాలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిందే.

Venkat
Published on: 27 Nov 2026 6:55 PM IST
Heated Blanket
X

రూమ్ హీటర్లు వేస్ట్.. హీటెడ్ బ్లాంకెట్‌తో చలికి చెక్ పెట్టేయండి.. ధరెంతంటే?

Heated Blanket: చలికాలంలో రాత్రి బెడ్ లేదా మంచంపైకి వెళ్లగానే దుప్పటి, బెడ్‌షీట్ కప్పుకోగానే వెచ్చగా ఉంటే ఎంత బాగుంటుంది. అయితే, ఇది ఊహలా ఏమాత్రం మిగిలిపోదండోయ్. ఇది నిజ రూపంలోకి వచ్చిందన్నమాట. అవును మీరు వింటున్నది నిజమే. దుప్పటి కప్పుకోగానే వెచ్చగా అయిపోతారంతే. దీంతో గదిలో హీటర్ ఆన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. హీటెడ్ బ్లాంకెట్ చేసే పని అదే. అయితే కరెంటుతో నడిచే ఈ దుప్పటిలో మంటలు అంటుకునే, చర్మం కాలే ప్రమాదం కూడా ఉండొచ్చు కాబట్టి కొనే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

హీటెడ్ బ్లాంకెట్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది?

చూడటానికి ఇది సాధారణ దుప్పటిలానే ఉంటుంది. కానీ లోపల ప్రత్యేకమైన సన్నని హీటింగ్ వైర్లు ఉంటాయి. కరెంట్ కనెక్షన్ ఇవ్వగానే ఆ వైర్లలో కరెంట్ ప్రవహించి అవి వేడెక్కుతాయి. ఆ వేడి దుప్పటి వస్త్రానికి చేరుతుంది. భారత్‌లో కూడా ఆన్‌లైన్ మార్కెట్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

సాధారణంగా ఇందులో ఒక కంట్రోలర్ ఉంటుంది. దాని సాయంతో వేడి స్థాయిని పెంచవచ్చు, తగ్గించవచ్చు.

కొన్ని మోడళ్లలో వేర్వేరు ఉష్ణోగ్రత సెట్టింగ్‌లు, టైమర్ ఉంటాయి.

కొన్ని ఖరీదైన మోడళ్లలో ఆటో షట్-ఆఫ్ ఫీచర్ ఉంటుంది. నిర్ణీత సమయం తర్వాత అది దుప్పటిని ఆటోమేటిక్‌గా ఆఫ్ చేస్తుంది.

రెండు రకాల డిజైన్లు..

అండర్ బ్లాంకెట్: దీన్ని పరుపు, బెడ్‌షీట్ మధ్య పరుస్తారు. పడుకునే ముందు పడకను వెచ్చగా చేయడానికి ఉపయోగపడుతుంది.

ఓవర్ బ్లాంకెట్: సాధారణ దుప్పటిలా శరీరంపై కప్పుకుంటారు.

అంటే ఇది గది మొత్తాన్ని వేడి చేయదు, మీరు పడుకునే స్థలాన్ని మాత్రమే వెచ్చగా ఉంచుతుంది.

రూమ్ హీటర్ అవసరం పోతుందా? కరెంట్ బిల్లు తగ్గుతుందా?

సాధారణ రూమ్ హీటర్ గదిలోని గాలిని వేడి చేస్తుంది. అంటే గదిలోని గాలి, చుట్టుపక్కల స్థలాన్ని వేడి చేయడానికి కూడా కరెంట్ ఖర్చవుతుంది. హీటెడ్ బ్లాంకెట్ మాత్రం నేరుగా పడకను వేడి చేస్తుంది. అందుకే మీ అవసరం కేవలం నిద్రపోయేటప్పుడు వెచ్చదనం మాత్రమే అయితే, రూమ్ హీటర్‌తో పోలిస్తే ఇది తక్కువ కరెంట్ ఖర్చుతో నడిచే ఆప్షన్ కావచ్చు. ఉదాహరణకు, గంటల తరబడి గది మొత్తం హీటర్ ఆన్ చేయాల్సిన పని ఉండదు. నిద్రకు ముందు దుప్పటి ఆన్ చేసి, పడక వెచ్చగా అయ్యాక ఆఫ్ చేయవచ్చు.

అయితే ప్రతి పరిస్థితిలోనూ ఇది హీటర్‌కు ప్రత్యామ్నాయం కాదు. గది చాలా చల్లగా ఉండి, కూర్చుని పనిచేసేటప్పుడు కూడా వెచ్చదనం కావాలంటే ఇది గదిని వేడి చేయదు. కాబట్టి రెండు పరికరాల పని వేరువేరు.

ధర..

ఇక ధర విషయానికి వస్తే కంపెనీని బట్టి రూ. 949 నుంచి రూ. 5900ల వరకు ఉన్నాయి. మీకు నచ్చిన మోడల్‌ను ఎంచుకుని ఇంటికి తెచ్చుకోవచ్చ.

రాత్రంతా ఆన్‌లో ఉంచి పడుకోవచ్చా?

ఇదే అత్యంత ముఖ్యమైన ప్రశ్న. లోపల కరెంట్ తీగలు ఉన్న దుప్పటిని రాత్రంతా ఆన్‌లో ఉంచి పడుకోవడం ఎంత సురక్షితం అనేది దుప్పటి నాణ్యత, భద్రతా వ్యవస్థ, వాడే విధానంపై ఆధారపడి ఉంటుంది.

కొత్త, మంచి నాణ్యత గల హీటెడ్ బ్లాంకెట్లలో ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. కొన్ని మోడళ్లలో టైమర్, ఆటో షట్-ఆఫ్ కూడా ఉంటుంది. దీనివల్ల అధికంగా వేడెక్కే ప్రమాదం తగ్గుతుంది.

బెస్ట్ ఆఫ్షన్: నిద్రకు 20 నుంచి 30 నిమిషాల ముందు దుప్పటి ఆన్ చేసి పడకను వేడి చేసుకోవాలి, పడుకునే ముందు ఆఫ్ చేయాలి.

కంపెనీ ఏదైనా నిర్దిష్ట మోడల్‌ను తక్కువ ఉష్ణోగ్రతలో నిరంతరం వాడవచ్చని అనుమతిస్తే, ఆ సూచనలను పాటించాలి.

పాత, పాడైన లేదా సరైన ఉష్ణోగ్రత నియంత్రణ లేని దుప్పట్లను రాత్రంతా ఆన్‌లో ఉంచడం ప్రమాదకరం. లోపలి వైరు దెబ్బతింటే కొన్ని చోట్ల అధిక వేడి పుట్టే అవకాశం ఉంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.