Google Gemini Decisions API: ఒకేసారి 1,000 ప్రశ్నలకు సమాధానాలు.. గూగుల్ జెమిని కొత్త ఏఐ టెక్నాలజీ వచ్చేసింది!

Google Gemini Decisions API: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గూగుల్ మరో కీలక ముందడుగు వేసింది. డెవలపర్ల కోసం జెమినీ డెసిషన్స్ ఏపీఐని పరిచయం చేసింది.

Venkat
Published on: 12 Nov 2026 8:11 PM IST
Google Gemini Decisions API
X

Google Gemini Decisions API: ఒకేసారి 1,000 ప్రశ్నలకు సమాధానాలు.. గూగుల్ జెమిని కొత్త ఏఐ టెక్నాలజీ వచ్చేసింది!

Google Gemini Decisions API: టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు ఏఐ టూల్స్‌తో ఎక్కువగా సమాచారాన్ని సేకరించడం, ప్రశ్నలకు సమాధానాలు పొందడం, కంటెంట్ తయారు చేయడం వంటి పనులు చేస్తున్నారు. అయితే ఇకపై ఏఐతో వేగంగా నిర్ణయాలు కూడా తీసుకునేలా గూగుల్ (Google) కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. అదే జెమినీ డెసిషన్స్ ఏపీఐ. డెవలపర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఏపీఐ జెమినీ డెసిషన్స్ ఏపీఐ 1 మోడల్‌పై పనిచేస్తుంది. ఒకే రిక్వెస్ట్‌లో 1,000 ప్రశ్నలను విశ్లేషించి సమాధానాలు ఇవ్వడం దీని ప్రధాన ప్రత్యేకత. కంటెంట్ పరిశీలన, ఏఐ మోడళ్ల ఎంపిక, ఆటోమేటెడ్ నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులకు ఇది ఉపయోగపడనుంది.

ఒకేసారి 1,000 ప్రశ్నలకు సమాధానాలు..

జెమినీ డెసిషన్స్ ఏపీఐలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఒకేసారి వెయ్యి ప్రశ్నలను విశ్లేషించే సామర్థ్యం. డెవలపర్లు ఒకే ఇన్‌పుట్‌ను అందించి దానికి సంబంధించి 1,000 ప్రశ్నలు అడగవచ్చు. ఈ ప్రశ్నలకు మూడు రకాలుగా సమాధానాలు పొందవచ్చు.

Yes or No: ఇచ్చిన సమాచారం సరైనదా? కాదా? అనే నిర్ణయం.

Multiple Choice: ఇచ్చిన ఆప్షన్లలో సరైనదాన్ని ఎంపిక చేయడం.

Scoring: నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా కంటెంట్‌కు స్కోర్ ఇవ్వడం.

ప్రతి సమాధానంతో పాటు ఆ నిర్ణయంపై ఏఐకు ఉన్న నమ్మక స్థాయిని సూచించే కాన్ఫిడెన్స్ స్కోర్ కూడా అందిస్తుంది.

టెక్స్ట్ మాత్రమే కాదు.. వీడియోలు, పీడీఎఫ్‌లు కూడా!

ఈ ఏపీఐ కేవలం టెక్స్ట్ ఆధారంగా మాత్రమే పనిచేయదు. ఫొటోలు, ఆడియో, వీడియోలు, PDF డాక్యుమెంట్లను కూడా ఇన్‌పుట్‌గా అందించవచ్చు. వాటిని విశ్లేషించి డెవలపర్లు అడిగిన ప్రశ్నలకు తగిన నిర్ణయాలు తీసుకోగలదు.

ఉదాహరణకు సోషల్ మీడియాలో వచ్చిన కంటెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందా? ఒక వీడియోలో నిర్దిష్ట అంశం ఉందా? ఏఐ ఏ మోడల్‌ను ఉపయోగించాలి? అనే ప్రశ్నలకు వేగంగా సమాధానాలు పొందవచ్చు. కంటెంట్ మోడరేషన్, ఏఐ ఏజెంట్లు సరైన టూల్స్‌ను ఎంచుకోవడం వంటి పనుల్లో ఇది ఉపయోగపడుతుంది.

150 నుంచి 250 మిల్లీసెకన్లలో నిర్ణయం!

సాధారణ జనరేటివ్ ఏఐ మోడళ్లు సమాధానాలను ఒక్కో టోకెన్‌గా రూపొందిస్తాయి. కానీ జెమినీ డెసిషన్స్ 1 భిన్నమైన విధానంలో పనిచేస్తుంది. అందుబాటులో ఉన్న ఆప్షన్లను విశ్లేషించి ఒకేసారి నిర్ణయాన్ని అందిస్తుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుందని గూగుల్ చెబుతోంది.

ఈ విధానం ద్వారా 150 నుంచి 250 మిల్లీసెకన్లలో ఫలితాలు అందించగలదని కంపెనీ వెల్లడించింది.

గూగుల్ ఇప్పటికే ఎక్కడ ఉపయోగిస్తోంది?

గూగుల్ తన కొన్ని సేవల్లో ఈ ఏపీఐని ఇప్పటికే ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.

జెమినీ నోట్ బుక్: యూజర్ ప్రశ్నకు తగిన ఏఐ మోడల్, థింకింగ్ లెవల్‌ను ఎంచుకోవడానికి ఉపయోగిస్తోంది. సాధారణ ప్రశ్నలకు స్పందించే సమయంలో ఆలస్యాన్ని 40 శాతం వరకు తగ్గించినట్లు గూగుల్ పేర్కొంది.

స్టిచ్: ప్రొడక్ట్ డిజైన్‌కు సంబంధించిన పనుల్లో ఉపయోగిస్తోంది.

సీసీ యాప్: తగిన ఎమోజీ రియాక్షన్లను ఎంపిక చేయడానికి ఉపయోగిస్తోంది.

గూగుల్ సెర్చ్: సెర్చ్ సేవల్లోని టూల్స్‌ను దుర్వినియోగం చేసే ప్రయత్నాలను గుర్తించడంలో సహాయపడుతోంది.

ధర ఎంత? డెవలపర్లు ఎలా ఉపయోగించాలి?

డెవలపర్లు గూగుల్ ఏఐ స్టూడియో ద్వారా జెమినీ డెసిషన్ ఏపీఐని ఉచితంగా పరీక్షించుకోవచ్చు. పెయిడ్ వినియోగానికి ప్రతి 10 లక్షల ఇన్‌పుట్ టోకెన్లకు 0.10 డాలర్లు, అంటే సుమారు రూ.9.39 ఛార్జ్ చేస్తోంది. అవుట్‌పుట్ టోకెన్లకు ఎలాంటి ఛార్జీ లేదని గూగుల్ తెలిపింది.

మరో ప్రత్యేకత ఏమిటంటే, ఒకే ఇన్‌పుట్‌కు సంబంధించి ఎన్నో ప్రశ్నలు అడిగినా షేర్ చేసిన ఇన్‌పుట్‌ను ఒక్కసారే లెక్కించి ఛార్జ్ చేస్తుంది. ఓపెన్ రూటర్, లాంగ్ చైన్, వెర్ సెల్, లైట్ ఎల్ ఎల్ ఎం వంటి ప్లాట్‌ఫామ్‌లకు కూడా దీని మద్దతు అందుబాటులోకి వస్తోంది.

మొత్తంగా చూస్తే జెమినీ డెసిషన్స్ ఏపీఐ ఏఐ రంగంలో మరో కీలక మార్పునకు దారితీయవచ్చు. ముఖ్యంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అప్లికేషన్లు, ఏఐ ఏజెంట్లు, కంటెంట్ మోడరేషన్ వ్యవస్థలకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.