Google Android Botnet: ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా.. షాకింగ్ న్యూస్ చెప్పిన గూగుల్..!
Google Android Botnet: ఆండ్రాయిడ్ పార్ట్‌నర్ అయిన ఓ చైనా కంపెనీ ఉద్దేశపూర్వకంగా 13 లక్షల డివైజ్‌లలో మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసిందని గూగుల్ బయటపెట్టింది. ఈ మాల్‌వేర్ సాయంతో బోట్‌నెట్ సృష్టించి, యూజర్ల ఇంటర్నెట్‌ను వారికి తెలియకుండానే వాడుకున్నారు.
Google Android Botnet: ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా.. షాకింగ్ న్యూస్ చెప్పిన గూగుల్..!
Google Android Botnet: గూగుల్ ఓ పెద్ద విషయాన్ని బయటపెట్టింది. ఓ ఆండ్రాయిడ్ పార్ట్‌నర్ కంపెనీ ఉద్దేశపూర్వకంగా 13 లక్షల డివైజ్‌లలో మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసిందని తెలిపింది. దీని ద్వారా ఆ ఫోన్లు, డివైజ్‌లపై నియంత్రణ సాధించి, వాటి ఇంటర్నెట్‌ను చోరీగా వాడుకున్నారు. అంతేకాదు, ప్రకటనలు కూడా చూపించారు.
ఏ కంపెనీ ఇది?
నివేదికల ప్రకారం, చైనాలోని షెన్‌జెన్ కేంద్రంగా పనిచేసే మ్యానుఫ్యాక్చరర్ వీడియోస్ట్రాంగ్ టెక్నాలజీ (Videostrong Technology) ఉద్దేశపూర్వకంగా ఇలా చేసింది. ఈ మాల్‌వేర్ ప్రధానంగా ఆండ్రాయిడ్ టీవీ సెట్-టాప్ బాక్సుల్లో ఉంది. దీని ద్వారా యూజర్లకు తెలియకుండానే "క్రిమినల్ అసోసియేట్స్" వారి ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉపయోగించుకునేలా అనుమతించిందని గూగుల్ చెప్పింది.
ఆర్థిక లబ్ధి కోసమే వీడియోస్ట్రాంగ్ ఈ బ్యాక్‌డోర్, బోట్‌నెట్‌ను సృష్టించి, డివైజ్‌లలో ఇన్‌స్టాల్ చేసి, ఆపరేట్ చేసిందని పూర్తి నమ్మకంతో అంచనా వేస్తున్నట్లు తన బ్లాగ్‌పోస్ట్‌లో గూగుల్ పేర్కొంది.
ఉద్యోగి పొరపాటు కాదు..
ఇది ఒక ఉద్యోగి పొరపాటు వల్ల లేదా డెవలప్‌మెంట్ సమయంలో జరిగిన లోపం వల్ల జరిగింది కాదని గూగుల్ స్పష్టం చేసింది. అందువల్ల ధ్రువీకరణ పొందిన (certified) ఆండ్రాయిడ్ డివైజ్‌లను తయారు చేయడం, విక్రయించడం, వాటికి సాఫ్ట్‌వేర్ అందించడంపై వీడియోస్ట్రాంగ్‌ను గూగుల్ నిషేధించింది.
వీడియోస్ట్రాంగ్ ఎలాంటి కంపెనీ?
వీడియోస్ట్రాంగ్ టెక్నాలజీ ఒక ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్ (OEM), ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరర్ (ODM) కంపెనీ. కస్టమర్ల కోసం ఉత్పత్తులు తయారు చేయడంతో పాటు సొంత ప్రోడక్ట్‌లను కూడా తయారు చేస్తుంది. ఈ కంపెనీ 2011లో ప్రారంభమైంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం దీని ఉత్పత్తులు 60కి పైగా దేశాల్లో 10 కోట్లకు పైగా ఇళ్లకు చేరాయి.
బోట్‌నెట్ అంటే ఏమిటి?
బోట్‌నెట్ అంటే మాల్‌వేర్ సోకిన డివైజ్‌ల నెట్‌వర్క్. హ్యాకర్లు మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి ఆ డివైజ్‌లను తమ నియంత్రణలోకి తీసుకోవచ్చు. అలా సోకిన డివైజ్‌లను ప్రకటనల మోసం, డేటా చోరీ, మరిన్ని మాల్‌వేర్‌ల ఇన్‌స్టాలేషన్ కోసం వాడుతారు.
సోకిన డివైజ్‌ల్లో ఎక్కువ భాగం ఆండ్రాయిడ్ టీవీ సెట్-టాప్ బాక్సులే. అయితే టెలీహెల్త్ డివైజ్‌లు, కరోకే మెషీన్లు, డిజిటల్ సైనేజ్ సిస్టమ్‌లలో కూడా ఈ మాల్‌వేర్ కనిపించింది. బోట్‌నెట్‌ను నియంత్రించే డొమైన్లు, సర్వర్లను మూసివేయడానికి గూగుల్ చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంది.
గతంలోనూ ఇలాంటి కేసులు..
బోట్‌నెట్ కేసు ఇదే మొదటిది కాదు. గత ఏడాది జర్మనీ అధికారులు బ్యాడ్‌బాక్స్ (BadBox) అనే బోట్‌నెట్‌ను బ్లాక్ చేశారు. దానివల్ల లక్షల కొద్దీ ఆండ్రాయిడ్ డివైజ్‌లు ప్రభావితమయ్యాయి. అలాగే Vo1d అనే మరో బోట్‌నెట్ సుమారు 16 లక్షల ఆండ్రాయిడ్ టీవీలకు సోకింది.




