Fake Google Chrome: ప్లే స్టోర్‌లో నకిలీ క్రోమ్ హల్చల్.. లక్షకు పైగా డౌన్లోడ్స్ సాధించి గూగుల్‌కే షాక్
Fake Google Chrome: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అప్లికేషన్లను సురక్షితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్‌ను ఎంతగానో నమ్ముతుంటారు.
Fake Google Chrome
Fake Google Chrome: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అప్లికేషన్లను సురక్షితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్‌ను ఎంతగానో నమ్ముతుంటారు. అయితే అక్కడ కూడా సైబర్ నేరగాళ్లు, నకిలీ డెవలపర్లు మోసాలకు పాల్పడుతున్నారనడానికి మరో విస్తుపోయే ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను పోలిన ఒక నకిలీ యాప్ ప్లే స్టోర్‌లో ప్రత్యక్షమై ఏకంగా లక్షకు పైగా డౌన్లోడ్స్ సాధించింది. ఈ అప్లికేషన్ అసలైన గూగుల్ క్రోమ్ ఐకాన్, పేరును యథాతథంగా కాపీ చేసి ప్రదర్శించడమే కాకుండా, సెర్చ్ ఫలితాల్లో అసలు యాప్ కంటే పైన కనిపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోన్అరేనా నివేదిక ప్రకారం, ఈ నకిలీ యాప్‌ను హిజ్బర్టెక్ అనే డెవలపర్ ప్లే స్టోర్‌లో జాబితా చేశాడు. తొలుత ఆగస్టు 22వ తేదీన ఈ యాప్‌ను బాల్ బౌన్స్ అనే సాధారణ గేమ్‌గా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సెప్టెంబర్ 30 నాటికి దీని పేరును హఠాత్తుగా Chrome అని మార్చి, అసలైన బ్రౌజర్ ఐకాన్‌ను అమర్చారు. రెడ్ డిట్ వేదికగా ఒక యూజర్ షేర్ చేసిన స్క్రీన్షాట్ల ద్వారా ఈ భారీ మోసం బయటపడింది. విషయం గూగుల్ దృష్టికి వెళ్లడంతో వెంటనే సదరు ఫేక్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి పూర్తిగా తొలగించారు.
బ్రౌజర్ కాదు.. వింత ఏఐ చాట్‌బాట్
ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుని పరిశీలించిన కొంతమంది యూజర్లు విస్తుపోయే విషయాలను వెల్లడించారు. ఈ యాప్‌ను ఓపెన్ చేయగానే ఎలాంటి వెబ్సైట్లు సెర్చ్ చేసే వెసులుబాటు లేదు. బదులుగా అందులో ఏఐ అవతార్, వింతైన చాట్ ఆప్షన్లు కనిపించాయి. దానికి ప్రశ్నలు అడిగితే సంబంధం లేని విచిత్రమైన సమాధానాలు లభించాయి. అంటే బ్రౌజింగ్ సేవలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. అయితే ఈ యాప్ ద్వారా డేటా చోరీ జరిగిందా లేదా ఇందులో హానికరమైన మాల్వేర్ ఉందా అనే అంశంపై స్పష్టమైన ఆధారాలు ఇంకా లభించలేదు.
గూగుల్ భద్రతా తనిఖీలపై ప్రశ్నల వర్షం
సాధారణంగా ఆఫిషియల్ స్టోర్‌లో ఉండే అప్లికేషన్లు ఎంతో సురక్షితమైనవని యూజర్లు భావిస్తారు. కానీ లక్ష కంటే ఎక్కువ సార్లు డౌన్లోడ్ అయ్యే వరకు ఈ నకిలీ యాప్‌ను గూగుల్ గుర్తించకపోవడం దాని సెక్యూరిటీ తనిఖీల వ్యవస్థపై సందేహాలను రేకెత్తిస్తోంది. అసలైన గూగుల్ క్రోమ్‌కు ప్రపంచవ్యాప్తంగా 10 బిలియన్లకు పైగా డౌన్లోడ్స్ ఉన్నాయి. అటువంటి ప్లాట్‌ఫామ్‌పై నకిలీ యాప్ సెర్చ్ రిజల్ట్స్‌లో అగ్రస్థానంలో కనిపించడంపై సాంకేతిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వినియోగదారులు యాప్‌లను డౌన్లోడ్ చేసుకునే ముందు కొన్ని ప్రాథమిక విషయాలను ఖచ్చితంగా గమనించాలని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. గూగుల్ క్రోమ్ లేదా గూగుల్ కి సంబంధించిన ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తున్నా డెవలపర్ పేరు Google LLC అని ఉందో లేదో సరిచూసుకోవాలి. యాప్ రివ్యూలు, రేటింగ్స్, మొత్తం డౌన్లోడ్ల సంఖ్యను పరిశీలించాలి. సెర్చ్ రిజల్ట్స్ లేదా ప్రకటనల్లో పైన కనిపిస్తున్నంత మాత్రాన కళ్లు మూసుకుని ఇన్స్టాల్ చేయకూడదు.




