Cyclon AI Phone: ఆండ్రాయిడ్, ఐఫోన్‌లకు పోటీగా కొత్త ఏఐ ఫోన్.. యాప్ స్టోర్‌లకు గుడ్‌బై చెప్పాల్సిందే ఇక..!

Cyclon AI Phone: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మరో కొత్త టెక్నాలజీకి తెరలేవబోతోంది. ఇప్పటివరకు ఏ పని చేయాలన్నా యాప్ ఓపెన్ చేసి మనమే ఆపరేట్ చేయాల్సి వచ్చేది.

Venkat
Published on: 4 Nov 2026 7:02 PM IST
Cyclon AI Phone
X

Cyclon AI Phone: ఆండ్రాయిడ్, ఐఫోన్‌లకు పోటీగా కొత్త ఏఐ ఫోన్.. యాప్ స్టోర్‌లకు గుడ్‌బై చెప్పాల్సిందే ఇక..!

Cyclon AI Phone: స్మార్ట్‌ఫోన్ రంగంలో గత కొన్నేళ్లుగా ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (iOS) ఆపరేటింగ్ సిస్టమ్‌లదే ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయానికి భిన్నంగా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఫోన్‌ను తీసుకొచ్చేందుకు ఓ స్టార్టప్ సిద్ధమైంది. వై కాంబినేటర్ (Y Combinator) F26 బ్యాచ్‌కు చెందిన సైక్లోన్ (Cyclon) సంస్థ ఈ కొత్త AI ఫోన్‌ను పరిచయం చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. యూజర్ ప్రతీ పనిని స్వయంగా చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం వాయిస్ కమాండ్ ఇస్తే చాలు.. ఫోన్‌లోని AI అవసరమైన పనులన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లో పూర్తి చేస్తుంది. అవసరమైతే కొత్త యాప్‌లను కూడా సృష్టించగలదని కంపెనీ చెబుతోంది.

అసలు Cyclon AI Phone ఎలా పనిచేస్తుంది?

సాధారణ స్మార్ట్‌ఫోన్లలో ఏదైనా పని చేయాలంటే ఒక యాప్ ఓపెన్ చేసి, మరో యాప్‌కు వెళ్లి వివరాలు షేర్ చేయాల్సి ఉంటుంది. కానీ Cyclon AI ఫోన్‌లో ఈ పనులన్నింటినీ AI నిర్వహిస్తుంది. ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను అర్థం చేసుకుని వాటిని స్వయంగా ఉపయోగించగలదు. ఉదాహరణకు వాట్సాప్ (WhatsApp) చాట్‌లో ఉన్న ఫొటోను మరో వ్యక్తికి పంపించాలనుకుంటే AIకి చెబితే సరిపోతుంది. సంబంధిత చాట్‌ను గుర్తించి, ఫొటోను పంపించే ప్రక్రియను పూర్తి చేస్తుంది.

జేబులో పెట్టినా పనిచేస్తుంది!

ఈ ఫోన్‌లో మరో ఆసక్తికరమైన ఫీచర్ బ్యాక్‌గ్రౌండ్ AI ఆపరేషన్. యూజర్ వాయిస్ కమాండ్ ఇచ్చిన తర్వాత ఫోన్‌ను జేబులో పెట్టుకోవచ్చు. AI మాత్రం వెనుక నుంచి తన పనిని కొనసాగిస్తుంది. అంటే ప్రతీ దశలో స్క్రీన్ చూడాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా ఫోన్‌లో మనం చేసే ట్యాపింగ్, యాప్ మార్పిడి పనులను AI చూసుకుంటుంది.

యాప్ స్టోర్ అవసరం ఉండదా?

ఈ ఫోన్‌లో యాప్ స్టోర్ అవసరాన్ని తగ్గించేలా మరో ప్రత్యేక ఫీచర్‌ను రూపొందించారు. యూజర్‌కు అవసరమైన ఫీచర్ కోసం ప్రత్యేక యాప్ లేకపోతే, అతడి అవసరాన్ని బట్టి AI కొత్త యాప్‌ను తయారు చేస్తుంది. దీనికి అవసరమైన వివరాలను యూజర్‌ను అడిగి తెలుసుకుంటుంది. తయారైన యాప్‌ను ఇతరులతో షేర్ చేయడంతో పాటు కొత్త ఫీచర్లను కూడా జోడించుకోవచ్చు. ఇందుకోసం APIs, MCPs, కస్టమ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

ప్రస్తుతం కంపెనీ గూగుల్ పిక్సెల్ 8a (Google Pixel 8a) హార్డ్‌వేర్‌పై తన Cyclon OSను ఇన్‌స్టాల్ చేసి తొలి బ్యాచ్ ఫోన్లను ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్డర్ చేసిన 30 రోజుల్లో డెలివరీ చేస్తామని కంపెనీ పేర్కొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. భవిష్యత్తులో సొంత హార్డ్‌వేర్‌ను కూడా అభివృద్ధి చేయాలని సంస్థ భావిస్తోంది. ఆన్-డివైస్ AI ద్వారా యూజర్ డేటాను ఫోన్‌లోనే ఉంచే విధంగా పనిచేయడం మరో ప్రత్యేకత. అయితే ఈ ఫోన్ వాస్తవ వినియోగంలో ఎంత సమర్థంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మరిన్ని పరీక్షలు, సమీక్షలు అవసరం.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.