24 గంటల్లో 1,730 పనులు.. చైనాలో హ్యూమనాయిడ్ రోబోల సంచలనం..!
Humanoid Robot Challenge: చైనా కంపెనీ ఎజీబాట్ (Agibot) షాంఘైలో 24 గంటల "రోబోట్స్ నెవర్ క్లాక్ అవుట్" లైవ్‌స్ట్రీమ్ ఛాలెంజ్ నిర్వహించింది.
24 గంటల్లో 1,730 పనులు.. చైనాలో హ్యూమనాయిడ్ రోబోల సంచలనం..!
Humanoid Robot Challenge: చైనా కంపెనీ ఎజీబాట్ (Agibot) షాంఘైలో 24 గంటల "రోబోట్స్ నెవర్ క్లాక్ అవుట్" లైవ్‌స్ట్రీమ్ ఛాలెంజ్ నిర్వహించింది. మనుషుల్లా కనిపించే ఆరు హ్యూమనాయిడ్ రోబోలను రిటైల్ స్టోర్ పనుల్లో నియమించారు. ఈ రోబోలు కలిసి కస్టమర్లకు స్వాగతం పలకడం, కాఫీ తయారుచేయడం, వస్తువుల లావాదేవీల వంటి 1,730 పనులను పూర్తి చేశాయి. అయితే రెండు రోబోలు విఫలమయ్యాయి.
ఫ్యాక్టరీల్లో మనుషుల ఉద్యోగాలను రోబోలు లాగేసుకుంటాయని ఒక వైపు ప్రజల్లో భయం ఉంది. కానీ కొన్నిసార్లు యంత్రాలు, రోబోలు కూడా తమ ఉద్యోగాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాయని, పనికి తగినవిగా నిరూపించుకోలేకపోతున్నాయని ఓ కొత్త ప్రయోగం చూపించింది.
చైనా రోబోట్ తయారీ సంస్థ ఎజీబాట్ ఇటీవల ఈ లైవ్‌స్ట్రీమ్ ఛాలెంజ్‌ను నిర్వహించింది. షాంఘైలోని షుహుయ్ జిల్లాలో ఉన్న ఓ స్టోర్‌లో ఆరు హ్యూమనాయిడ్ రోబోలను 24 గంటల షిఫ్ట్‌లో పనికి పెట్టారు. రిటైల్ స్టోర్‌లోని రోజువారీ పనులను ఈ హ్యూమనాయిడ్ రోబోలు పగలు, రాత్రి వేర్వేరు సమయాల్లో నిర్వహించగలవా లేదా అని పరీక్షించడమే ఈ ఛాలెంజ్ లక్ష్యం.
24 గంటల్లో 1,730 పనులు..
ఈ ఛాలెంజ్‌లో ఆరు రోబోలు కలిసి 24 గంటల్లో మొత్తం 1,730 పనులను పూర్తి చేశాయి.
683 సార్లు కస్టమర్లకు స్వాగతం పలికాయి.
369 సార్లు వస్తువుల లావాదేవీలు జరిపాయి.
147 సార్లు కాఫీ తయారు చేశాయి.
మిగతా పనుల్లో వేడి ఆహారపు ఆర్డర్లు, షెల్ఫ్ తనిఖీ, వస్తువులు నింపడం, టేబుల్ శుభ్రం చేయడం ఉన్నాయి.
ఈ ఛాలెంజ్‌ను రోజులో నాలుగు వేర్వేరు సమయాలకు అనుగుణంగా రూపొందించారు: లంచ్ సమయంలో రద్దీ, సాయంత్రం రద్దీ, రాత్రి సమయం, ఉదయం టిఫిన్ సమయంలో రద్దీ. వేర్వేరు పరిస్థితుల్లో యంత్రాల పనితీరు ఎలా ఉంటుందో చూడటమే లక్ష్యం.
నాలుగు రోబోలు ఓకే.. రెండు ఫెయిల్
నాలుగు రోబోల పనితీరు బాగుంది. కానీ షెల్ఫ్ శుభ్రత, నిర్వహణ పనుల్లో ఉన్న రెండు రోబోలు విఫలమయ్యాయి. ఐటీహోమ్ (ITHome) రిపోర్ట్ ప్రకారం:
క్లీనింగ్ రోబోట్: దాని దారిలో చెత్తతో నిండిన డబ్బా ఎదురైంది. దాన్ని తొలగించడానికి బదులు, రోబోట్ తన నిర్ణీత మార్గం నుంచి తప్పిపోయి స్టోర్ బయటకు వెళ్లిపోయింది, తిరిగి తన స్థానానికి రాలేకపోయింది.
షెల్ఫ్ నిర్వహణ రోబోట్: ఉత్పత్తులను తనిఖీ చేయడంలో, వాటిని తిరిగి నింపడంలో చొరవ లోపించింది. స్టోర్ పని వేగంతో అది కలిసిపోలేకపోయింది.
మనుషుల అవసరం ఇంకా ఉంది
హ్యూమనాయిడ్ రోబోలు ఎంత స్మార్ట్ అయినా, వాటికి ఇంకా మనుషుల అవసరం ఉంది. ఎందుకంటే హార్డ్‌వేర్‌తో కలిసి పనిచేయడంలో AI ఏజెంట్లు ఇంకా అంత మెరుగ్గా లేవు.
గత నెలలో అమెరికాకు చెందిన స్టార్టప్ డైమెన్షనల్ (Dimensional) శాన్ ఫ్రాన్సిస్కో వీధుల్లో తమ రోబో డాగ్స్‌ను తిప్పడానికి మనుషులను పనికి పెట్టుకుంటున్నట్లు ప్రకటన ఇచ్చింది. డైమెన్షనల్ వ్యవస్థాపకుడు స్టాష్ పోమిచ్టర్ దీని గురించి మాట్లాడారు. పట్టణ వాతావరణంలో యంత్రాలు స్వయంగా తిరిగే సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేందుకే ఈ వ్యక్తులను నియమించామని ఆయన తెలిపారు. రోబో డాగ్స్‌కు ఇంకా మనుషుల అవసరం ఉందని, AI ఏజెంట్లు హార్డ్‌వేర్‌ను సరిగా నియంత్రించలేవని ఆయన అన్నారు.




