ఇకపై నో టెన్షన్.. భారత్ సందేశ్ పేరుతో కొత్త స్వదేశీ యాప్.. రిలీజ్ ఎప్పుడంటే?
Bharat Sandesh App: ప్రభుత్వ పథకాల సమాచారం ప్రజలకు చేరవేస్తూ, వారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేలా భారత్ సందేశ్ పేరుతో కొత్త స్వదేశీ యాప్‌ను ప్రదర్శించారు.
ఇకపై నో టెన్షన్.. భారత్ సందేశ్ పేరుతో కొత్త స్వదేశీ యాప్.. రిలీజ్ ఎప్పుడంటే?
Bharat Sandesh App: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య నేరుగా సమాచార మార్పిడికి ఉపయోగపడే కొత్త స్వదేశీ వేదికగా భారత్ సందేశ్‌ను ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో ప్రదర్శించారు. బీఎస్‌ఎన్‌ఎల్ మౌలిక వ్యవస్థపై పనిచేసే ఈ వేదికను వీఐహెచ్ మెసెంజర్ రూపొందించినట్లు సమాచారం. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వివరాలను ప్రజలకు చేరవేయడంతో పాటు వారి అభిప్రాయాలను సేకరించడం దీని ప్రధాన ఉద్దేశం.
సాధారణంగా ప్రభుత్వ యాప్‌లు, వేదికలు సమాచారాన్ని ప్రజలకు అందించడానికే ఎక్కువగా ఉపయోగపడతాయి. భారత్ సందేశ్‌లో మాత్రం రెండు వైపుల సమాచార మార్పిడికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంటే ప్రభుత్వం సమాచారం పంపడమే కాకుండా ప్రజలను ప్రశ్నించి వారి స్పందనను కూడా తెలుసుకోవచ్చు.
ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందించే సదుపాయం ఇందులో ఉంది. వినియోగదారులు తమ భాషలో మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ లేదా ఏఐ కాల్స్ ద్వారా సమాధానాలను కూడా ఇవ్వవచ్చని తెలిపారు.
ఈ వేదికపై విదేశీ నియంత్రణ లేదని పేర్కొంటున్నారు. వినియోగదారుల సమాచారం దేశం వెలుపలకు వెళ్లకుండా భారతదేశంలోనే ఉంటుందని చెబుతున్నారు. డేటా, నిబంధనలు భారతీయ చట్టాల పరిధిలో ఉంటాయని సమాచారం. విదేశీ నియంత్రణ స్విచ్ లేదా విదేశీ అల్గారిథమ్ ఆధారపడటం ఉండదని కూడా పేర్కొన్నారు.
వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలకు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సదుపాయం కూడా ఉంటుందని వెల్లడించారు. అయితే ఈ యాప్ ప్రజలకు ఎప్పుడు, ఎక్కడ అందుబాటులోకి వస్తుందనే వివరాలు ఇంకా ప్రకటించలేదు. అందుబాటులోకి వస్తే ప్రభుత్వ సమాచారంతో పాటు ప్రజల సమస్యలను నేరుగా చేరవేసే దేశీయ వేదికగా ఇది ఉపయోగపడనుంది.




