16 ఏళ్ల బాలుడి అద్భుత ఆవిష్కరణ.. ఇంటర్నెట్ లేకుండానే వాయిస్‌తో లైట్లు, ఫ్యాన్లు కంట్రోల్..!

Jarvis Smart Switchboard: సాధారణంగా ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు వాయిస్‌తో కంట్రోల్ చేయాలంటే Alexa, Google Home వంటి స్మార్ట్ పరికరాలు అవసరం. అయితే 16 ఏళ్ల కుర్రాడు మాత్రం వీటికి భిన్నంగా ఓ సరికొత్త టెక్నాలజీని రూపొందించాడు.

Venkat
Published on: 11 Nov 2026 8:43 PM IST
Jarvis Smart Switchboard
X

16 ఏళ్ల బాలుడి అద్భుత ఆవిష్కరణ.. ఇంటర్నెట్ లేకుండానే వాయిస్‌తో లైట్లు, ఫ్యాన్లు కంట్రోల్..!

Jarvis Smart Switchboard: టెక్నాలజీ రంగంలో అద్భుతాలు సృష్టించడానికి వయసుతో సంబంధం లేదని ఓ 16 ఏళ్ల బాలుడు నిరూపించాడు. సాధారణంగా ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, టీవీలను వాయిస్ కమాండ్స్‌తో కంట్రోల్ చేయాలంటే Alexa, Google Home వంటి స్మార్ట్ పరికరాలను ఉపయోగిస్తుంటారు. అయితే వీటిలో చాలా వరకు ఇంటర్నెట్ కనెక్షన్‌పై ఆధారపడతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా The Noob Engineer అనే 16 ఏళ్ల విద్యార్థి సరికొత్త హోమ్ ఆటోమేషన్ సిస్టమ్‌ను రూపొందించాడు. దీనికి Jarvis అని పేరు పెట్టాడు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇంటర్నెట్ అవసరం లేకుండానే కేవలం మన మాటలతో ఇంట్లోని లైట్లు, ఫ్యాన్లను కంట్రోల్ చేయవచ్చు.

ఏమిటీ Jarvis ప్రత్యేకత?

ఈ విద్యార్థి రూపొందించిన Jarvis ఓ కాంపాక్ట్ హార్డ్‌వేర్ పరికరం. దీన్ని ఇంట్లోని స్విచ్‌బోర్డుకు అనుసంధానం చేయవచ్చు. Jarvis అని పిలవగానే ఈ సిస్టమ్ వాయిస్ కమాండ్స్ స్వీకరించడానికి సిద్ధమవుతుంది. ఆ తర్వాత All lights off, Fan on, Fan off వంటి ఆదేశాలు ఇస్తే వెంటనే వాటిని అమలు చేస్తుంది. అంటే స్విచ్‌బోర్డు దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పరికరాలను నియంత్రించవచ్చు.

ఇంటర్నెట్ లేకుండానే పనిచేస్తుంది..!

ఈ ప్రాజెక్టులో అందరినీ ఆకట్టుకుంటున్న అంశం డేటా ప్రైవసీ. సాధారణ స్మార్ట్ స్పీకర్లు క్లౌడ్ సర్వర్లపై ఆధారపడతాయి. కానీ Jarvis మాత్రం ఆన్-డివైస్ వాయిస్ రికగ్నిషన్, లోకల్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీంతో వాయిస్ కమాండ్స్ కోసం ఇంటర్నెట్ లేదా బయటి సర్వర్ల అవసరం ఉండదు. వ్యక్తిగత సమాచారం క్లౌడ్ సర్వర్లకు వెళ్లే అవకాశం కూడా తగ్గుతుంది. ఫలితంగా వినియోగదారుల ప్రైవసీకి ప్రాధాన్యత లభిస్తుంది.

ఎలా పనిచేస్తుంది ఈ స్మార్ట్ స్విచ్‌బోర్డ్..?

ఈ వ్యవస్థలో మైక్రోకంట్రోలర్, ఆఫ్‌లైన్ స్పీచ్ రికగ్నిషన్ చిప్, రిలే మాడ్యూల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. మైక్రోఫోన్ ద్వారా వాయిస్ కమాండ్ అందుకున్న తర్వాత, ముందుగానే ప్రోగ్రామ్ చేసిన ఆదేశాలతో దాన్ని సరిపోల్చి సంబంధిత పరికరాన్ని ఆన్ లేదా ఆఫ్ చేస్తుంది. ఇంటర్నెట్‌పై ఆధారపడకపోవడంతో కమాండ్స్ వేగంగా అమలవుతాయి.

GitHubలో సోర్స్ కోడ్ కూడా..!

ఈ ప్రాజెక్టును తన దగ్గరే ఉంచుకోకుండా ఇతరులు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయాలనే ఉద్దేశంతో విద్యార్థి సోర్స్ కోడ్, సర్క్యూట్ వివరాలను GitHubలో అందుబాటులో ఉంచాడు. చిన్న వయసులోనే ఇలాంటి ఆవిష్కరణ చేయడం టెక్నాలజీ ప్రపంచంలో ఆసక్తిని కలిగిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఆఫ్‌లైన్ హోమ్ ఆటోమేషన్ పరికరాలు అందుబాటులోకి వస్తే స్మార్ట్ హోమ్ టెక్నాలజీ మరింత సులభతరం కానుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.