Ichchapuram: ఉద్దానంలో డయాలసిస్ బెడ్లు పెంచాలి: కాంగ్రెస్ ధర్నా

Ichchapuram: ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం తక్షణమే డయాలసిస్ బెడ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ ఇచ్ఛాపురంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 4 Oct 2026 9:03 PM IST
Ichchapuram
X

Ichchapuram: ఉద్దానంలో డయాలసిస్ బెడ్లు పెంచాలి: కాంగ్రెస్ ధర్నా

ఇచ్ఛాపురం: ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగుల ఇబ్బందులను పరిష్కరించాలని, తక్షణమే డయాలసిస్ బెడ్ల సంఖ్యను పెంచి మరణాల రేటును అరికట్టాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ పూడి కిరణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా డీసీసీ అధ్యక్షులు సనపల అన్నాజీ రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్దానంలో కిడ్నీ సమస్య ఏళ్ల తరబడి ప్రజలను పట్టిపీడిస్తున్నా పాలకులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. డయాలసిస్ యూనిట్లలో సరిపడా పడకలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన ఉచిత వైద్యం అందించి, అన్ని విధాలా న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

డాక్టర్ పూడి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే స్పందించి అదనపు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి, పడకల సంఖ్యను పెంచకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కోత మధుసూదన్ రావు, డీసీసీ సెక్రెటరీ అలీమ్ ఖాన్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram