Tekkali: దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను పరిశీలించిన మంత్రి!
Tekkali: టెక్కలిలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విస్తృత పర్యటన: తుఫానుతో దెబ్బతిన్న రోడ్లు, కొత్త అగ్రహారం వద్ద కూలిన వంతెన, పంట పొలాల పరిశీలన.. అధికారులకు కీలక ఆదేశాలు.
Tekkali: దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను పరిశీలించిన మంత్రి!
శ్రీకాకుళం: టెక్కలి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విస్తృత పర్యటన చేశారు. టెక్కలి మండలం పరిధిలోని మెలియాపుట్టి రహదారిని పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం విస్తృతంగా పరిశీలించారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రహదారులను స్వయంగా పరిశీలించారు. రహదారుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖల అధికారులతో పరిస్థితిపై సమీక్షించి, ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
పాడైన రహదారులకు మరమ్మతులు చేపట్టడంతో పాటు, కొత్త రహదారుల ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని అన్ని గ్రామాలకు నూతన రహదారులు వేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని రహదారులు, పంచాయతీరాజ్, ఐటీడీఏ అధికారులకు సూచించారు.
నందిగామ మండలం కొత్త అగ్రహారం వద్ద తుఫాన్ ప్రభావంతో కూలిపోయిన వంతెనను మంత్రి పరిశీలించారు. వంతెన పునర్నిర్మాణానికి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఆదేశించారు.
వర్షాలతో వ్యవసాయ పొలాల్లో చేరిన నీటిని కూడా మంత్రి పరిశీలించారు. పంట పొలాల్లో నీటి నిల్వలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రాంతాల్లో నిలిచిన నీరు బయటకు వెళ్లేలా కాలువలు, నీటి మార్గాలను సరిచేయాలని అధికారులకు సూచించారు. రైతులకు నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, AMC చైర్మన్ శేషగిరిరావు, తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




