Tekkali: రైలు ప్రమాదంలో నలుగురు విద్యార్థుల మృతిపై మంత్రి అచ్చెన్న దిగ్భ్రాంతి

Tekkali: టెక్కలిలో రైలు ప్రమాద ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, క్షతగాత్రునికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 23 Sept 2026 8:42 PM IST
Tekkali
X

Tekkali: రైలు ప్రమాదంలో నలుగురు విద్యార్థుల మృతిపై మంత్రి అచ్చెన్న దిగ్భ్రాంతి

టెక్కలి: టెక్కలి మండలం రావివలస సమీపంలోని బర్మా కాలనీ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నౌపడ నుంచి గుణుపూర్ వైపు వెళ్తున్న రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందగా, మరో విద్యార్థి గాయపడిన ఘటన అత్యంత బాధాకరమని మంత్రి పేర్కొన్నారు.

రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ టెక్కలి వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ ప్రమాదంలో గంగువాడ విశాఖరావు (17), డమర గ్రామం, టెక్కలి మండలం; జన్ని దిలీప్ కుమార్ (17), డమర గ్రామం, టెక్కలి మండలం; జన్ని శరత్ కుమార్ (17), చిన్న భీంపురం గ్రామం, టెక్కలి మండలం; సవర శివ (17), సవర వీధి, మెలియాపుట్టి గ్రామం, మెలియాపుట్టి మండలం మృతి చెందారు.

మృతుల కుటుంబాలకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ప్రమాదంలో గాయపడిన గంగువాడ సల్మాన్ రాజు (18), నాగరాజు కుమారుడు, ఎస్టీ కాపు సవర, డమర గ్రామం, టెక్కలి మండలంకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అవసరమైన వైద్య సహాయాన్ని తక్షణమే అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఘటనపై రెవెన్యూ, పోలీసు అధికారులు, స్థానిక యంత్రాంగంతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. మృతుల వివరాలను వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి.. అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు.

రైల్వే ట్రాక్‌ల సమీపంలో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఈ విషాద ఘటనలో నలుగురు విద్యార్థులను కోల్పోవడం అత్యంత బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.