Kanchili: బీసీలను ఓట్ల కోసమే టీడీపీ వాడుకుంది: ఎమ్మెల్సీ నర్తు రామారావు

Kanchili: బీసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకోవడం టీడీపీకి అలవాటని, పదవులిచ్చి గౌరవించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ నర్తు రామారావు ఘాటుగా విమర్శించారు.

G.RAMBABU, SOMPET
Published on: 12 Oct 2026 2:22 PM IST
Kanchili
X

Kanchili: బీసీలను ఓట్ల కోసమే టీడీపీ వాడుకుంది: ఎమ్మెల్సీ నర్తు రామారావు

Kanchili: కంచిలి బీసీల అభ్యున్నతి గురించి మాట్లాడే ముందు తెలుగుదేశం పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు సవాల్‌ విసిరారు. ఎన్నికల సమయంలో బీసీలు గుర్తుకొస్తారని, ఎన్నికల అనంతరం వారి సంక్షేమాన్ని విస్మరిస్తారని టీడీపీపై విమర్శలు చేశారు. బీసీలకు రాజకీయ పదవులు, గౌరవం కల్పించి ప్రాధాన్యం ఇచ్చింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సోమవారం కంచిలిలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎం.వి. కృష్ణారావుకు టీడీపీ నాలుగుసార్లు టికెట్‌ కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ, బీసీలకు ఆ పార్టీ ఇచ్చిన ప్రాధాన్యం ఏమిటో ప్రజలే అర్థం చేసుకోవాలని అన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా దాదాపు తొమ్మిదేళ్లు అవకాశం కల్పించినప్పటికీ, బీసీలకు రాజకీయంగా ఎంత ప్రాధాన్యం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలవలస విక్రాంత్‌, దువ్వాడ శ్రీనివాసరావు తదితర బీసీ నాయకులకు ఎమ్మెల్సీ పదవులు కల్పించడంతో పాటు, పలువురికి వివిధ రాజకీయ పదవులు ఇచ్చి ప్రోత్సహించిన ఘనత జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.

జగన్‌ ప్రభుత్వ హయాంలో బీసీలకు 40 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు కల్పించారని రామారావు తెలిపారు. ఇప్పుడు బీసీలకు మేలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న టీడీపీ నాయకులు, గతంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గుర్తుంచుకోవాలని అన్నారు. బీసీలకు మేలు చేసినట్లు ప్రచారం చేసుకోవడం వేరు, వారికి అవకాశాలు కల్పించి ఆచరణలో చూపించడం వేరని వ్యాఖ్యానించారు.

ఇచ్చాపురం నియోజకవర్గ అభివృద్ధి, బీసీలకు కల్పించిన రాజకీయ అవకాశాలపై టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. కిడ్నీ బాధితుల ప్రాణాలను కాపాడేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, కిడ్నీ పరిశోధన కేంద్రం, సురక్షిత తాగునీటి సదుపాయాల కోసం భారీగా నిధులు వెచ్చించిందని గుర్తుచేశారు. తమది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల అమలైతే, టీడీపీది ఆర్భాట ప్రచారమని విమర్శించారు.

సమావేశంలో బీసీ నాయకుడు కొల్లి ఈశ్వరరావు, కంచమ్మతల్లి ఆలయ కమిటీ చైర్మన్‌ వంజరాన కేశవరావు, పీఏసీఎస్‌ మాజీ సభ్యుడు గుమ్మడి రామదాసు, మాజీ ఎంపీటీసీ వైకుంఠరావు తదితర వైసీపీ బీసీ నాయకులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET