Srikakulam: వాయుగుండం ప్రభావంపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
Srikakulam: శ్రీకాకుళంలో వాయుగుండం ప్రభావంపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే 08942-240557 సంప్రదించాలని సూచన.
Srikakulam: వాయుగుండం ప్రభావంపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
శ్రీకాకుళం: వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. వాతావరణ పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి తుఫాన్ ప్రభావం పై సమీక్షిస్తున్నారు.
వాయుగుండం ప్రభావంపై జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందేలా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎగువ ప్రాంతాలతో పాటు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదుల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రజలు, పశువుల కాపరులు నదులు, వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకూడదని, వరద నీటిని దాటేందుకు ప్రయత్నించవద్దని కోరారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు
సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు ఉంటే తమ పరిస్థితిని వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేసి, అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్లి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని సూచించారు.
ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి
తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అధికారుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేయవద్దని కోరారు.
అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి
వర్షాలు, వరదలు, రహదారుల పరిస్థితి, ఇతర అత్యవసర పరిస్థితులకు సంబంధించి సమాచారం లేదా సహాయం అవసరమైన ప్రజలు జిల్లా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని మంత్రి సూచించారు.
జిల్లా కంట్రోల్ రూమ్: 08942-240557
అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టాలి
వర్షాలు, వరదల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. వాయుగుండం ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




