Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన నదుల్లో తగ్గుముఖం పట్టిన వరద!

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో నదుల్లో తగ్గుముఖం పట్టిన వరద ఉధృతి. వంశధార గొట్టా బ్యారేజీ వద్ద కొనసాగుతున్న తొలి ప్రమాద హెచ్చరిక. మడ్డువలస గేట్లు ఎత్తివేత.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 31 Oct 2026 6:25 PM IST
Srikakulam
X

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన నదుల్లో తగ్గుముఖం పట్టిన వరద!

శ్రీకాకుళం: జిల్లాను వణికించిన తుఫాను వర్షాలు నిలిచిపోవడంతో ప్రధాన నదుల్లో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. వంశధార, నాగావళి, బహుదా నదుల్లో ప్రవాహం గణనీయంగా తగ్గింది. అయితే వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజీ వద్ద మాత్రం ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు. కుడి, ఎడమ కాలువలను పూర్తిగా మూసివేసి, వస్తున్న నీటిని వస్తున్నట్లుగా దిగువకు వదిలేస్తున్నారు.

వంశధార, బహుదా నదుల తాజా పరిస్థితి:

గొట్టా బ్యారేజీ వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంటకు 48,576 క్యూసెక్కుల వరద ఉండగా., ఉదయం 9:00 గంటలకు 40,356 క్యూసెక్కులకు ప్రవాహం తగ్గింది. బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టం 38.10 మీటర్లు కాగా ప్రస్తుతం 34.87 మీటర్ల వద్ద నీరు ఉంది. మరోవైపు రెండు రోజుల క్రితం మహోగ్ర రూపం దాల్చిన బహుదా నది ఉధృతి పూర్తిగా కట్టడిలోకి వచ్చింది. ఇచ్ఛాపురం వద్ద ఈ ప్రవాహం కేవలం 19,048 క్యూసెక్కులకు పడిపోయింది.

నాగావళి, మడ్డువలస ప్రాజెక్టులలో ప్రవాహం ఇలా:

నాగావళి నదిలో సైతం వరద ఉధృతి పూర్తిగా తగ్గింది. తోటపల్లి నారాయణపురం ఆనకట్ట వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 23,400 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీకాకుళం పాత వంతెన వద్ద ప్రవాహం 24,000 క్యూసెక్కులుగా ఉంది. ఇదిలా ఉండగా గొర్లె శ్రీరాములు నాయుడు మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్టుకు 12,450 క్యూసెక్కుల వరద వస్తుండగా, స్పిల్‌వే ద్వారా 16,550 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 3.373 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.652 టీఎంసీల (78.61 శాతం) నీరు నిల్వ ఉంది. వరద తగ్గుముఖం పడుతుండటంతో తీర ప్రాంత ప్రజలు, జిల్లా యంత్రాంగం పూర్తిగా ఊపిరి పీల్చుకున్నాయి.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.