Srikakulam: 34 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేసిన చంద్రబాబు

Srikakulam: 34 శాతం రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు బీసీలను దగా చేశారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో మండిపడ్డారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 9 Oct 2026 4:32 PM IST
Srikakulam
X

Srikakulam: 34 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేసిన చంద్రబాబు

శ్రీకాకుళం: 34 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను చంద్రబాబు పచ్చిగా దగా చేశారు అంటూ శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తెచ్చిన జీవోలను సుప్రీంకోర్టు కొట్టేయడంతో బాబు నయవంచన మరోసారి బట్టబయలైంది. బీసీల గణాంకాలు ఎలా సేకరించాలో చట్టంలో స్పష్టంగా ఉంటే ఈ కన్ఫ్యూజన్ ఎందుకు సృష్టిస్తున్నారు? ఒక రోజు ఏకసభ్య కమిషన్ అంటారు.

మరో రోజు కుటుంబ సర్వే అంటారు.. ఈ లెక్కలు కోర్టుల్లో నిలబడతాయని మీకు తెలియదా? కోర్టుల్లో వీగిపోతాయని తెలిసే ఎందుకు బీసీలను దగా చేస్తున్నారు? అని అన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణలు జరిగి 20 ఏళ్లు దాటినా ఈ ప్రక్రియను పద్ధతిగా ఎందుకు పూర్తి చేయలేకపోయారు? బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంపై కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు.

అనవసరపు జీవోలు, కోర్టు ఫీజులతో ప్రజల సొమ్మును, సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారు? ఢిల్లీ వెళ్లిన మీ ప్రతినిధి బృందం కేంద్రం దగ్గర అసలు బీసీ రిజర్వేషన్ల గురించి ఏం మాట్లాడిందో సమాధానం చెప్పాలి. అధికారులను దబాయించి చట్టవ్యతిరేక జీవోలు తెచ్చినందుకు రాష్ట్రంలోని బీసీలకు చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తెలిసి తప్పు చేసి, ప్రజలను మోసగించి, అబద్ధాలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు.

జగన్ మోహన్ రెడ్డి గారు కేబినెట్, రాజ్యసభ, స్థానిక సంస్థల పదవుల్లో 34 శాతానికి పైగా బీసీలకే ఇచ్చి చూపించారు. రాజకీయంగా చిత్తశుద్ధి ఉంటే చట్టంతో పనిలేకుండా బీసీలకు న్యాయం చేయవచ్చని జగన్ పాలన నిరూపించింది. బీసీ కమిషన్ చేయాల్సిన పనిని కుటుంబ లెక్కలంటూ తప్పదోవ పట్టిస్తే కోర్టులు ఎలా అంగీకరిస్తాయి? చట్టబద్ధమైన బీసీ కమిషన్ ద్వారా మాత్రమే సమగ్ర సర్వే జరిపించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.