Srikakulam: ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలి మంత్రి అచ్చెన్నాయుడు!

Srikakulam: శ్రీకాకుళం తండేవలస పోలీస్ శిక్షణ కేంద్రంలో 142 మంది సివిల్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 29 Sept 2026 1:57 PM IST
Srikakulam
X

Srikakulam: ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలి మంత్రి అచ్చెన్నాయుడు!

Srikakulam: నూతనంగా ఎంపికైన పోలీసు కానిస్టేబుళ్లు రాజ్యాంగానికి విధేయులుగా ఉంటూ నిజాయితీ, నిష్పక్షపాతంగా, ప్రజల హక్కులను గౌరవిస్తూ సమాజానికి అంకితభావంతో సేవలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్య, సహకార శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

శ్రీకాకుళం జిల్లా తండేవలసలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో 142 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్ల 6వ బ్యాచ్ ప్రాథమిక శిక్షణ ముగింపు సందర్భంగా మంగళవారం ఘనంగా నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వందేమాతర గీతాలాపనతో ప్రారంభమైన ఈ వేడుకలో మంత్రి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కే.వి. మహేశ్వరరెడ్డిలతో కలిసి కవాతును పరిశీలించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కానిస్టేబుళ్లు చట్టసమ్మతంగా విధులను నిర్వర్తిస్తామని ప్రమాణ స్వీకారం చేశారు.

పరేడ్ కమాండర్ చింతపల్లి నాగేశ్వరరావు నేతృత్వంలో ఐదు కంటింజెంట్లు నిర్వహించిన మార్చ్ పాస్ట్ ఎంతగానో ఆకట్టుకుంది. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కోల దుర్గారావు, కోట గౌతమ్, జరుగు ఆంజనేయులు, కోల కొత్త ప్రసాద్‌లతో పాటు శిక్షణ సిబ్బందికి మంత్రి ప్రశంసా పత్రాలు, ట్రోఫీలను అందజేశారు.

అనంతరం మంత్రి కింజరాపు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న మహిళా భద్రత (మహిళలపై నేరాల నియంత్రణ), మాదకద్రవ్యాల (డ్రగ్స్) నిరోధం, రహదారి భద్రత (రోడ్ సేఫ్టీ) అంశాలలో పోలీసులు క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్దేశించారు. ఇటీవలి తుఫాను సమయాల్లో శ్రీకాకుళం జిల్లాలోని మూడు నదుల వరద ముంపు వేళల్లో బాధితుల తరలింపు, సహాయక చర్యల్లో పోలీస్ డిపార్ట్‌మెంట్ అందించిన సేవలు అద్భుతమని కొనియాడారు. శిక్షణ అనేది ఇక్కడితో ముగిసిపోదని, మారుతున్న నేరాల శైలికి అనుగుణంగా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ యూనిఫాం గౌరవాన్ని, ప్రభుత్వం, దేశ కీర్తిని పెంచాలని ఆకాంక్షించారు.

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా నిరంతరం సంబంధం కలిగి ఉండేది కానిస్టేబుళ్లేనని, ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న మహిళా భద్రత, మాదకద్రవ్యాల నిరోధం, రహదారి భద్రత అంశాలలో క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్దేశించారు.

అనంతరం జిల్లా ఎస్పీ కే.వి. మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ... 9 నెలల పాటు సాగిన కఠిన శిక్షణను 142 మంది క్యాడెట్లు విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఉన్నత విద్యార్హతలు కలిగిన ఈ బ్యాచ్ సభ్యులు సిసిటిఎన్ఎస్, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విచారణలో రాణించాలని, బాధితుల సమస్యలను ఓపికగా విని న్యాయం చేయాలని సూచించారు. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రిక్రూట్‌మెంట్ చేపట్టి, వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కాగా, కృష్ణా, రాజమండ్రి జిల్లాలకు చెందిన ఈ 142 మంది క్యాడెట్లలో 17 మంది పీజీ, 100 మంది బి.టెక్, బి.ఎస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు ఉన్నారని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, ఎన్.ఈశ్వరరావు, డి పి టి సి ప్రిన్సిపాల్ పి. శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.