Srikakulam: శ్రీకాకుళంలో నేటి నుంచి ‘స్వచ్ఛతా హి సేవా’ పక్షోత్సవాలు: కలెక్టర్!

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 16 Sept 2026 11:05 PM IST
Srikakulam
X

Srikakulam: శ్రీకాకుళంలో నేటి నుంచి ‘స్వచ్ఛతా హి సేవా’ పక్షోత్సవాలు: కలెక్టర్!

శ్రీకాకుళం: పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత చైతన్యం తేవడమే లక్ష్యంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా ‘స్వచ్ఛత హి సేవా - 2026’ పక్షోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.

నేటి సాయంత్రం కలెక్టరేట్ నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో చెత్త విభజన, వర్షపు నీటి సంరక్షణ, పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై రోజువారీ ప్రణాళిక ప్రకారం ప్రచారం నిర్వహించాలని సూచించారు.

అక్టోబర్ 1న 'ఒక రోజు, ఒక గంట, అందరం కలసి' పిలుపుతో శ్రమదానం, అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా గ్రామసభలు, కౌన్సిల్ సమావేశాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. సఫాయి మిత్రుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పూర్తి నివేదికలు నిర్వహించాలని ఆదేశించారు.

పాలనలో పారదర్శకత, ప్రభుత్వ సేవలందింపుపై ప్రజల అభిప్రాయం ఆధారంగా ఆయా విభాగాలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాలు - పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ విభాగం 82.1 స్కోరుతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తం చేసిన కలెక్టర్, ఎఫ్-లైన్ సర్వే స్కోరు కూడా గణనీయంగా పెరిగి 71.6కి చేరడాన్ని ప్రశంసించారు.

ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ సర్వే స్కోరు, దీపం 2.0 పథకంలో ప్రగతి మందగించడంపై ప్రత్యేక దృష్టి సారించి లోపాలను తక్షణమే సవరించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇదే సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, నూతన పెన్షన్ల దరఖాస్తులు, ఇ-ఆఫీస్ వినియోగం, రీసర్వే, రేషన్ పంపిణీ, తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ సేవలు అందించడంలో అధికారులు సానుకూల దృక్పథంతో, అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

పారిశుద్ధ్య పనుల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా అధికారులు భౌతికంగా హాజరుకాగా, మండల స్థాయి అధికారులు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.