Srikakulam: తుఫాను నష్టాలపై పక్కాగా లెక్క తేల్చండి – కలెక్టర్!
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో తుఫాను నష్టాలపై పక్కాగా గణన నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశం. రోడ్లు, పంట నష్టాలపై తక్షణ నివేదికలకు స్పష్టీకరణ.
Srikakulam: తుఫాను నష్టాలపై పక్కాగా లెక్క తేల్చండి – కలెక్టర్!
శ్రీకాకుళం: తుఫాను ప్రభావం తగ్గుముఖం పట్టడంతో జిల్లాలో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణపై దృష్టి సారించాలని, ఎక్కడా జాప్యం లేకుండా క్షేత్రస్థాయికి వెళ్లి పక్కాగా ఎన్యూమరేషన్ (గణన) నిర్వహించి నష్టాల ప్రాథమిక అంచనాలు తక్షణమే రూపొందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన కంట్రోల్ రూమ్ అధికారులతో ఆయన పర్యవేక్షించారు. అంతకుముందు కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. తుఫాను తగ్గిన అనంతరం క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, వర్షాల వల్ల ఎదురైన సమస్యల వివరాలను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తుఫాను తగ్గినా వర్షాలు కురుస్తున్నాయని, ఇప్పటికే ఈదురుగాలులు, వర్షాల కారణంగా రహదారులపై ఎక్కడైనా చెట్లు కూలడం, రాకపోకలకు అంతరాయం కలగడం వంటివి జరిగి ఉంటే తక్షణమే పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.
ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడుతూ.. రోడ్లు, వంతెనలు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు వాటిల్లిన నష్టంపై నివేదికలు సిద్ధం చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో సమీక్షిస్తూ.. జిల్లాలో వరి, అరటి, కొబ్బరి తదితర పంటలకు జరిగిన నష్టాలపై క్షేత్రస్థాయిలో సర్వేను వెంటనే ప్రారంభించి, ఏ ఒక్క రైతు నష్టపోకుండా పారదర్శకంగా జాబితాలు రూపొందించాలని ఆదేశించారు.
మరోవైపు జిల్లాలో ప్రవహిస్తున్న వంశధార, నాగావళి నదులతో పాటు ప్రధాన గెడ్డలు, జలాశయాల నీటి మట్టాలు, ప్రస్తుత వరద ప్రవాహ పరిస్థితిని జలవనరుల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కాలువ గట్లు, బలహీన ప్రాంతాల వద్ద పటిష్ట నిఘా ఉంచాలని సూచించారు.
లోతట్టు, ముంపు బారిన పడిన గ్రామాల్లో తక్షణమే పారిశుధ్య చర్యలు చేపట్టి, తాగునీటి పథకాలను పునరుద్ధరించి క్లోరినేషన్ చేయాలని, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.




