Srikakulam: మలేషియాలో చిక్కుకున్న శ్రీకాకుళం యువకులు!

Srikakulam: మలేషియాలో చిక్కుకున్న శ్రీకాకుళం యువకుల కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా. స్వస్థలాలకు తీసుకొచ్చే బాధ్యత తనదేనని హామీ.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 21 Sept 2026 10:43 AM IST
Srikakulam
X

Srikakulam: మలేషియాలో చిక్కుకున్న శ్రీకాకుళం యువకులు!

Srikakulam: మలేషియాలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురు యువకుల కుటుంబ సభ్యులు ఆదివారం శ్రీకాకుళంలోని క్యాంప్ కార్యాలయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కలిశారు. తమ కుటుంబ సభ్యుల పరిస్థితిని మంత్రికి వివరించి, వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

సోంపేట మండలం ఎర్ర ముక్కాం గ్రామానికి చెందిన చీకటి సాయి వంశీ, సిరి మామిడి గ్రామానికి చెందిన గిరిబాబు, వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన చొక్కర సాయి, లండ తరుణ్ కుమార్ లు చిక్కుకున్నారు. ఈ మేరకు వారి తల్లితండ్రులు పాపారావు, పోతయ్య, మధుర లక్ష్మీ, లండ ఈశ్వరరావు, విజయలక్ష్మి లు కేంద్ర మంత్రిని కలసి టూరిస్ట్ వీసా తో వెళ్ళి మలేషియా పోలీసులకు చిక్కుకున్న తమవారిని క్షేమంగా తీసుకురావాలని కోరారు. ఇందులో మధ్యవర్తుల ఇబ్బందులు కూడా ఉన్నాయని కేంద్ర మంత్రి దృష్టికి సమస్యను చేర్చారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి ధైర్యం చెప్పారు. యువకులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడానికి తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. మలేషియా అధికారులతో పాటు భారత ఎంబసీ, విదేశాంగ శాఖతో నిరంతరం సమన్వయం చేస్తున్నామని తెలిపారు.

నేడు తాజా పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని, అప్పటి వరకు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని రామ్మోహన్ నాయుడు భరోసా కల్పించారు. యువకులను వీలైనంత త్వరగా క్షేమంగా స్వస్థలాలకు తీసుకురావడానికి అన్ని విధాలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

కేంద్ర మంత్రిని కలసిన వారిలో మత్స్యకార నాయకులు సూరాడ చంద్రమోహన్, అశోక్, రాజు, దుర్గారావు, అఖిల్ తదితరులు ఉన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.