Pathapatnam: స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: రెడ్డి శాంతి!

Pathapatnam: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 10 Nov 2026 4:17 PM IST
Pathapatnam
X

Pathapatnam: స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: రెడ్డి శాంతి!

పాతపట్నం: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలు అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలకు, ప్రజాస్వామ్య విధ్వంసానికి పరాకాష్టగా నిలిచాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి తీవ్రస్థాయిలో విమర్శించారు. నామినేషన్ల ప్రక్రియ నుంచి డిక్లరేషన్ ఫారాలు అందించే వరకు అధికార పార్టీ దౌర్జన్యాలు, అక్రమాలు యథేచ్ఛగా సాగాయని ఆరోపించారు.

ప్రజల తీర్పును అధికార బలంతో తారుమారు చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లను కూటమి నాయకులు ప్రలోభాలకు గురిచేశారని, కొత్త పింఛన్లు మంజూరు చేస్తామంటూ ఆశ చూపించి ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో గెలిచిన అభ్యర్థులను సైతం ఓడిపోయినట్లుగా చూపించే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు.

రాజ్యాంగబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోయిందని రెడ్డి శాంతి ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరును పక్షవాతం వచ్చిన రోగితో పోల్చారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వంద అబద్ధాలు, యాభై నీతులు చెప్పినట్లుగా ఉందని విమర్శించారు.

నామినేషన్ల దశ నుంచి ఓట్ల లెక్కింపు వరకు కూటమి నాయకులు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా నిలబడి పోరాడారని ఆమె పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో జరిగిన పోరాటాలు రేపటి పార్టీ విజయానికి తొలిమెట్లుగా అభివర్ణించారు. గట్టి పోటీ ఇచ్చిన నాయకులకు, ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీ కోసం బలంగా పోరాడిన కార్యకర్తలకు భవిష్యత్తులో పార్టీ సముచిత అవకాశాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు.

ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేసి పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్క ఓటరుకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM