Srikakulam: తండేవలస పోలీస్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
Srikakulam: శ్రీకాకుళం జిల్లా తండేవలస పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి సందర్శించి, సాంకేతిక పరిజ్ఞానం, నూతన చట్టాలపై పట్టు సాధించాలని సూచించారు.
Srikakulam: తండేవలస పోలీస్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
శ్రీకాకుళం: పోలీసు విధుల్లో ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి పోలీసు సిబ్బంది పనిచేయాలని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి సూచించారు. తండేవలసలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని నేడు సాయంత్రం సందర్శించిన ఆయన, శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి శిక్షణ కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలోకి అడుగుపెడుతున్న యువత కొత్త రక్తం వంటివారని,శిక్షణ కాలాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణ, శారీరక దృఢత్వంతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.ముఖ్యంగా ప్రస్తుత నూతన నేర న్యాయ చట్టాలైన బిఎన్.ఎస్., బిఎన్.ఎస్.ఎస్ పై పూర్తి అవగాహన పెంచుకోవాలని, చట్టాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేలా విధంగా శిక్షణ పొందాలని తెలిపారు.
ప్రస్తుత ఆధునిక పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని ఎస్పీ పేర్కొన్నారు. అందువల్ల శిక్షణలోనే కంప్యూటర్లు, డ్రోన్ టెక్నాలజీ, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తు విధానాలపై ప్రత్యేక నైపుణ్యం పెంపొందించుకోవాలని హితవు పలికారు.
తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణలో అభ్యర్థులకు అందించిన శిక్షణా విధానం, శిక్షణా కార్యక్రమాల పురోగతిని ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇండోర్ తరగతి గదిలో అభ్యర్థులకు బోధిస్తున్న సి.సి.టి.ఎన్.ఎస్., పోలీసింగ్,సాంకేతిక నైపుణ్యాల శిక్షణను కొద్దిసేపు తరగతిలో కూర్చుని పరిశీలించారు.
అనంతరం శిక్షణ కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన మౌలిక వసతులు, వసతి, ఆహారం, మంచినీటి సదుపాయాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, శిక్షణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. శిక్షణార్థులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ ఇమ్మన్యావల్ రాజు తదితరులు ఉన్నారు.




